తెలంగాణాలో అధికార పార్టీ కరదీపికగా భావిస్తున్న ‘నమస్తే తెలంగాణా’ దినపత్రికలో పనిచేస్తున్న దిగువ స్థాయి విలేకరులకు డేంజర్ బెల్స్ మోగాయి. అందులో పనిచేస్తున్న కంట్రిబ్యూటర్ల భవిష్యత్తుకు ప్రామాణికాన్ని నిర్దేశిస్తూ సంస్థకు చెందిన బాధ్యుడు ఒకరు ఆదివారం అర్ధరాత్రి దాటాక తాఖీదు లాంటి ఆదేశాన్ని అంతర్గత వాట్సాప్ గ్రూపుల్లో పంపించారు. ఈ పరిణామంతో సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఒక్కసారిగా కంగుతిన్నారు.
ఇక నుంచి ప్రతి కంట్రిబ్యూటర్ ప్రతి నెల 15 కాపీల చొప్పున పత్రిక సర్క్యులేషన్ పెంచాల్సిందేనని ఆయా మెసేజ్ ద్వారా నిర్దేశించారు. ఇందులో ఎటువంటి మినహాయింపులు ఉండవని కూడా స్పష్టం చేశారు. ఈ అంశంలో ప్రతి నెల 3వ తేదీకల్లా ప్రతి కంట్రిబ్యూటర్ పనితీరును వివరిస్తూ హైదరాబాద్ కు మెసేజ్ పెట్టాలని బ్రాంచ్ మేనేజర్లను, బ్యూరో ఇంచార్జిలను ఆదేశించారు.
ఇచ్చిన ‘టార్గెట్’ను పూర్తి చేయడంలో విఫలమైన కంట్రిబ్యూటర్లను తొలగించాలని కూడా స్పష్టం చేశారు. మరో కంట్రిబ్యూటర్ ను చూసుకుందామని, రాజీ ప్రసక్తే లేదని కూడా తేల్చి చెప్పారు. నమస్తే తెలంగాణాలోని మండల స్థాయి విలేకరుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైన ఆయా ఆదేశపు ప్రతి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.