వార్త పత్రికల్లో కీలక మార్పులు….✍️✍️
కనీస విద్యార్హత డిగ్రీ.. లేకుంటే జర్నలిస్టు కాదు.
కనీస విద్యార్హత లేని వాళ్ళు చాలామంది జర్నలిస్టుగా చెలామణికి బ్రేక్.
ఇప్పటికే రాష్ట్రంలోని చాలా పత్రికలు పోటా పోటీగా తమ జిల్లా ఎడిషన్లను తొలగించాయి.
అయితే ఈ నెల ఆఖరుకు యాజమాన్యాలు, ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. కనీసం డిగ్రీ అర్హత లేని వాళ్లను జర్నలిస్టుగా గుర్తించవద్దని, అక్రిడేషన్ కార్డులు కూడా వాళ్లకు ఎట్టి పరిస్థితిలో ఇవ్వవద్దని నిర్ణయించుకున్నాయి.
ప్రస్తుత జీఓ (అక్రిడేషన్) మేరకు ఒక్కో నియోజక వర్గ పరిధిలో ఒక రిపోర్టర్ ను మాత్రమే ఉంచేలా మార్పులను చేయనున్నట్లు సమాచారం.
ఇదే జరిగితే మండలాల్లో రిపోర్టర్లం అని చెప్పుకునే ఎందరో రిపోర్టర్లు ఇంటి దారి పట్టనున్నారు.
అలాగే జిల్లా కేంద్రంలో రిపోర్టర్ల కేటాయింపు విషయానికి వస్తే 2 లేదా 1 గా ఏర్పాటు చేసుకొనున్నట్లు, నియోజకవర్గానికి ఒక రిపోర్టర్ మాత్రమే నియమించుకోవాలన్నట్లు సమాచారం.
జర్నలిస్ట్ కావాలనుకునే వారు మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో డిగ్రీ ఉండాల్సిందే అనే విషయం జీఓ ద్వారా స్పష్టంగా కనిపిస్తోంది.
కనీస విద్యార్హత లేని విలేకరులకు మరో 3 నెలల తర్వాత అరణ్య, అజ్ఞాత వాసాలు తప్పవనే వినికిడిలు వినిపిస్తున్నాయి.
ఈరోజు ఉదయం నుంచీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్ట్ ఇది. ఔనా…? నిజంగానే తెలుగు మీడియాలో, ముఖ్యంగా ప్రింట్ మీడియాలో అనూహ్య మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ఇదే జరిగితే ఎంత మంది విలేకరుల కుటుంబాలు వీధిన పడనున్నాయి? విలేకరుల ముసుగులో కొందరు లంపెనిస్టులు, క్రిమినల్స్ , బ్లాక్ మెయిలర్లుగా పోలీసు రికార్డుగల వారి గురించి వదిలేయండి… కానీ ఇన్నాళ్లపాటు జర్నలిజాన్నే వృత్తిగా నమ్ముకున్న నిజమైన, నికార్సయిన పాత్రికేయుల పరిస్థితి ఏమిటి? ఇదీ జర్నలిస్టు సర్కిళ్లలో తాజాగా ఏర్పడిన ఆందోళన.
కరోనా పుణ్యమా అని ప్రధాన పత్రికలు జిల్లా ఎడిషన్లను ఎత్తేశాయి. పేజీలు తగ్గిపోయాయి. సబ్ ఎడిటర్లకూ అనేక ప్రముఖ పత్రికల యాజమాన్యాలు మంగళం పాడేస్తున్నాయి. పేజీలే లేనప్పుడు డజన్ల కొద్దీ గల సబ్ ఎడిటర్లకు మాత్రం పనేముందటుందనేది ప్రశ్న. నిజమే జిల్లా ఎడిషన్లు, పేజీలు ఉంటేనే సబ్ ఎడిటర్లకు మనుగడ. కానీ పరిస్థితి ఇప్పుడు తిరగబడింది. అనేక మంది సబ్ ఎడిటర్ల కొలువులు ఊడుతున్నాయ్. డెస్క్ జర్నలిస్టులుగా అభివర్ణించే వీరంతా ప్రస్తుతం నిస్సహాయులుగానే మిగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కంట్రిబ్యూటర్లకూ ప్రమాదం ఏర్పడినట్లేనా?
తెలుగు మీడియాలోని ప్రధాన పత్రికల్లో పనిచేస్తున్న కంట్రిబ్యూటర్ల సంఖ్య ఉమ్మడి జిల్లాల వారీగా కనీసం వంద మంది ఉంటారు. నగరాలు, పట్టణాల్లో మరికొందరు కంట్రిబ్యూటర్లు అదనంగా ఉంటారు. వీరందరినీ కలుపుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ప్రధాన పత్రికకు కనీసంగా వెయ్యి నుంచి 1,100 మంది వరకు కంట్రిబ్యూటర్లు ఉంటారు. కానీ నియోజకవర్గం వరకే ‘కంట్రిబ్యూటర్’ను పరిమితం చేస్తే రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు మాత్రమే రిపోర్టర్లు మిగులుతారు. పట్టణాలు, నగరాల్లో ఒకరో, ఇద్దరినో అదనంగా మిగిలిస్తే గరిష్టంగా వీరి సంఖ్య 200 కూడా దాటకపోవచ్చు. అంటే సగటున ప్రతి ప్రధాన పత్రికలో దాదాపు 900 మంది విలేకరుల కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదముంది. ఇది తెలుగు మీడియాలో తీవ్రంగా కలవరపరిచే అంశం.
చేదుగా భావించినప్పటికీ నిజాలనే ప్రస్తావించుకుంటే… అనేక ప్రధాన పత్రికలు కంట్రిబ్యూటర్లకు చెల్లిస్తున్న మొత్తం నామమాత్రమే. తాజాగా ఓ ప్రముఖ పత్రికలో చోటు చేసుకున్న పరిణామాన్నే ఉదహరిస్తే ఓ కంట్రిబ్యూటర్ కు నెలవారీ లైన్ ఎకౌంట్ మొత్తం రూ. 300 మాత్రమే వచ్చింది. కానీ అతను వాడుతున్న మొబైల్ బిల్లు నిర్దేశిత పరిమితిని మించి రూ. 500 అదనంగా వచ్చింది. మిగతా రూ. 200 మొత్తాన్ని రిపోర్టర్ లైన్ ఎకౌంట్ నుంచి ఎలా కట్ చేయాలతో తెలియక అకౌంట్ విభాగపు సిబ్బంది మల్లగుల్లాలు పడుతున్నారు. ఇదీ అనేక మంది కంట్రిబ్యూటర్ల దీనస్థితి. ఈ పరిస్థితుల్లో కంట్రిబ్యూర్ల వ్యవస్థకు మంగళం పాడితే యాజమాన్యాలకు కలిగే ప్రయోజనమేంటి? సంస్థకు నష్టమా? లాభమా? ఇదీ సాగుతున్న చర్చ.
వాస్తవానికి కంట్రిబ్యూటర్లను వదిలించుకుంటే పత్రికా యాజమాన్యాలకే భారీ నష్టంగా చెప్పక తప్పదు. పేరుకే విలేకరి అయినప్పటికీ యాడ్స్, సర్క్యులేషన్ పనులను కూడా కంట్రిబ్యూటర్లే నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ మద్ధతు పుష్కలంగా ఉన్న పత్రికలు సైతం కంట్రిబ్యూటర్ మెడపై కత్తిపెట్టి మరీ రెవెన్యూ టార్గెట్లు విధిస్తున్నాయి. ఈ బాధలు భరించలేక కొందరు కంట్రిబ్యూటర్లు ప్రాణాలను సైతం విడుస్తున్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అనే తారతమ్యాలేవీ ఇందులో లేవు. అందరిదీ ఒకే బాధ. ఒకే వ్యథ. పత్రికా యాజమాన్యాల రెవెన్యూ టార్గెట్లను పూర్తిచేసే క్రమంలో అనేక మంది కంట్రిబ్యూటర్లు బద్నాం కూడా అవుతున్నారు. ఇదే అదునుగా దండుకుంటున్న విలేకరుల సంఖ్య కూడా కొంత వరకు ఉందనేది నిజమే కావచ్చు. మరికొందరు విలేకరులు ఇంకొందరు బ్యూరో ఇంచార్జిలకు ‘కప్పం’ కట్టలేక ప్రాణాలు విడుస్తున్నారనే ప్రచారం కూడా ఉండనే ఉంది.
ఈ పరిస్థితుల్లో ఓవైపు సర్క్యులేషన్, మరోవైపు యాడ్స్ రూపంలో ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న ‘కంట్రిబ్యూటర్ల’ వ్యవస్థను తెలుగు మీడియా అంత సులభంగా వదులుకుంటుందా? ఇదే జరిగితే సంస్థ రెవెన్యూ మరింతగా దిగజారిపోదా? ఇందుకు పత్రికా యాజమాన్యాలు సాహసిస్తాయా? కంట్రిబ్యూటర్లకు లైన్ ఎకౌంట్ కూడా ఇవ్వకుండా, ఎదురు చెల్లింపులను వసూల్ చేసుకుంటున్నట్లు ప్రచారంలో గల పత్రికలు ఇందుకు సుముఖతను వ్యక్తం చేస్తాయా? ఇటువంటి అనేక ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. అందువల్ల చెప్పొచ్చేదేమిటంటే… లైన్ ఎకౌంట్ మొత్తాన్ని కూడా చెల్లించకుండా కంట్రిబ్యూటర్లను అన్ని రకాలుగా పిండుకుంటున్న పత్రికా యాజమాన్యాలు వారిని తొలగించేందుకు నడుం బిగించకపోవచ్చు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆయా పోస్టు ఫేక్ కావచ్చు.