తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న ‘దళిత బంధు’ పథకం బూమరాంగ్ కాబోతున్నదా? హుజూరాబాద్ నియోజకవర్గం కేంద్రంగా ఉధృతమవుతున్న దళితుల ఆందోళనలు ఇదే సందేహాన్ని రేకెత్తిస్తున్నాయి. దళిత బంధు పథకంపై దళితులు శనివారం ఆందోళనకు దిగారు. హుజూరాబాద్ పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద, పాపయ్యపల్లె క్రాస్ రోడ్డు వద్ద దళిత బంధు పథకంపై పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అర్హులైన ఎస్సీలకు పథకాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. దళితుల ఆందోళనతో హుజూరాబాద్ దద్దరిల్లగా, కరీంనగర్-వరంగల్ మార్గంలో భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది.
కాగా దళిత బంధు పథకం అమలుపై నిన్న కూడా స్థానికంగా భారీ ఎత్తున ఆందోళనా కార్యక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే. హుజూరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఎస్సీలు ఈ పథకం అమలు తీరుతెన్నులపై ఆరోపణలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఏకంగా వీణవంక తహశీల్దార్ ఆఫీసునే ముట్టడించారు. దళిత బంధు పథకాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తున్నారని ఆరోపించారు. పలు ప్రాంతాల్లో పథకాన్ని ‘టీఆర్ఎస్ బంధు’గా అభివర్ణించారు.
అయితే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ పథకం అమలుపై పుకార్లను నమ్మవద్దని కరీంనగర్ కలెక్టర్ ఆర్ వీ కర్ణన్ కోరారు. ఇప్పటి వరకు ఎంపిక సర్వే మాత్రమే జరిగిందని, పథకాన్ని ఇంకా ఎవరికీ మంజూరు చేయలేదన్నారు. మరోవైపు ఈనెల 16న సీఎం కేసీఆర్ హుజూరాబాద్ పర్యటనకు వస్తున్నారు. దళిత బంధు పథకాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభిస్తారని అధికారులు ప్రకటించిన నేపథ్యంలో ఎస్సీల ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడం గమనార్హం.