దివిసీమ ఉప్పెన…ఇప్పటి తరానికి తెలియని ఓ విషాదం… ప్రకృతి సృష్టించిన విలయతాండవం…ఇప్పటి సౌకర్యాలు లేవు…సాంకేతికత అంతకన్నా లేదు…అక్కడ ఏం జరిగిందో…ఎంత మంది అసువులు బాసారో…అంతా ప్రశ్నార్థకమే…అధికార యంత్రాంగం అక్కడికి చేరుకునేలోపే ఉప్పెనై… విరుచుకుపడి… వేలాది మందిని సముద్రం ఈడ్చుకువెళ్లింది. శవాలను దహనం చేసేందుకు రాజమండ్రి జైల్లో గల కరడుగట్టిన నేరస్థుల సహాయం తీసుకోవలసిన అవసరం ఏర్పడింది. ఈ ఘటన జరిగి సరిగ్గా 42 ఏళ్లు…అప్పటి ఉప్పెన పాత తరాన్ని ఇంకా భయానికి గురి చేస్తూనే ఉంది. నవంబర్ నెల వచ్చిందంటే అప్పటి పీడ కళ్ల ముందు కదలాడి… సముద్రాన్ని చూసి ఆ ప్రాంత వాసులు ఇప్పటికీ గజ గజ వణికిపోతూనే ఉన్నారు. ‘దివిసీమ ఉప్పెన’గా ప్రాచుర్యం పొందిన అప్పటి ఉదంతాన్ని మచిలీపట్నానికి చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఎన్. జాన్సన్ జాకబ్ కళ్లకు కట్టినట్లు అక్షర రూపంలో వివరించారు. చదవండి…
అది 1977 నవంబర్ 14వ తేదీ.. బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ ద్విపాలలో ప్రాణం పోసుకున్న తుఫాను నాలుగు రోజులు గడిచేసరికి పశ్చిమానకు ప్రయాణించింది సముద్రంలో అలజడి ప్రారంభమైంది. తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైకి 900 కిలోమీటర్ల దక్షిణ తూర్పు దిశగా కేంద్రీకృతమైంది సాయంత్రానికి అలజడి ఉదృతమైంది. తన దిశను మార్చుకొని ఆంధ్రప్రదేశ్ తీరానికి వడి వడిగా దూసుకొచ్చింది. సముద్రంలో ఆ తుపాను కన్ను 300 కిలోమీటర్ల పరిధిలో సుడులు తిరుగుతూ భయంకర ఉదృతితో పెను ఉప్పెనగా మారింది. నవంబర్ 18వ తేదీ శుక్రవారం నుంచి మూడు రోజులపాటు అన్ని స్కూళ్ళనూ మూసి వేస్తున్నట్లు నాటి కృష్ణా కలెక్టర్ ఏ.వీ.ఎస్ రెడ్డి అధికారికంగా ప్రకటించాడు. ఉదయం నుండి తీవ్రమైన నల్లటి మబ్బులు ఆకాశం అంతా కమ్ముకొని దాదాపు గంటకు వంద మైళ్ళ కంటే వేగంతో గాలులు మొదలైనాయి. రాత్రి పది దాటిన తర్వాత తుఫాను భీభత్సం పెరిగింది. మిన్నూ మన్నూ ఎకమయ్యేట్లు భీబత్సంగా వర్షం కురిసింది.
నవంబర్ 17 వ తారీకు ఉదయం 6 గంటలకు ఉప్పెన ఉగ్రరూపం దాల్చడంతో గంటలోనే వాతావరణం మారిపోయింది. ఉప్పెన సమయంలో 250 కిలోమీటర్ల వేగంతో తీరంలో బలమైన గాలులు వీయడం మొదలైంది . 17,703 టన్నుల సామర్ధ్యంతో సముద్రంలో ప్రయాణిస్తున్న ఎం.వి. జగస్వామిని అనే ఓడ ఆ సమయంలో ‘ సైక్లోన్ ఐ ‘ దరిదాపులలో వెళుతూ ఒక చిగురుటాకు మాదిరిగా వణికిపోయిందని ఆ ఓడ కెప్టెన్ తర్వాత రోజు తన అనుభవాన్ని నమోదుచేశారు.
విశాఖపట్నం రేడియో కేంద్రం సముద్రంలో ఈ భయానక తుపాను గమనం గురించి తీరవాసులను అప్రమత్తం చేస్తూ గంట గంటకూ హెచ్చరికలు ప్రసారం చేయడం మొదలయ్యింది. కోస్తా తీరంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు సంభావించే ఒక సాధారణ తుఫానుగానే దాన్ని అత్యధికులు భావించారు. కానీ , 1977 నవంబర్ 19 వ తేదీ కోస్తా తీరంలో ఒక చీకటి అధ్యాయంగా చరిత్రలో నిలిచిపోయింది. సముద్రంలో బడబాగ్ని రగులుకొందని రాకాసి అలలతోపాటు గంధకం నీటిలో రగిలి పచ్చని మంటలు వ్యాపించడం చూసామని ఎందరో ఈనాటికీ చెబుతుంటారు. కడలి ఉగ్ర రూపానికి తెల్లారేసరికి కేవలం దివిసీమలోనే 14వేల మందికి పైగా బ్రతుకులు తెల్లారిపోయాయి. దివిసీమ శవాల దిబ్బగా మారిపోయింది. ఎక్కడ చూసిన శవాలే, ఈ ఘటనలో నాలుగు లక్షల జంతువులు మృత్యువాతపడగా, సుమారు 355 కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. కృష్ణా గుంటూరు జిల్లాలలో దాదాపు కోటికి పైగా ఇళ్ళు నేలమట్టమయ్యాయి. 5 లక్షల 70 వేల పశుపక్ష్యాదులు మృత్యువాత చెందాయి. ఇక పారిశ్రామిక నష్టం నాటి ఉప్పెనకు 172 కోట్ల రూపాయలుగా ప్రభుత్వ అధికార గణాంకాలలో నమోదుకాబడింది.
ఈ తుపాను కృష్ణా డెల్టా ప్రాంతంపై అత్యంత తీవ్ర ప్రభావాన్ని చూపింది. కృష్ణా జిల్లా లోని దివిసీమలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతంలో ఆరు మీటర్ల ఎత్తున అలలు ఎగసి పడ్డాయి. తుపాను తర్వాత వందలాది శవాలు నీళ్ళలో తేలుతూ కనిపించాయి. గుర్తుపట్టలేనంతగా దెబ్బ తిన్న అనేక శవాలను సామూహిక దహనం చెయ్యాల్సి వచ్చింది. వాల్తేరు కిరండల్ రైలు మార్గంలో కొండ రాళ్ళు జారి పడి, పట్టాలను పెళ్ళగించాయి. బాపట్లలో దాదాపు వందమంది ప్రజలు.. ఒక చర్చిలో తలదాచుకోగా అది కూలడంతో మరణించారు. వరి పొలాలు, వాణిజ్య పంటలను ఉప్పెన ముంచెత్తింది. పదమూడు ఓడలు తుపానులో చిక్కుకుని గల్లంతయ్యాయి. కేవలం కృష్ణాజిల్లా పై మాత్రమేకాక గుంటూరు ప్రకాశం జిల్లాలపై గూడా చాలా ఈ తుఫాను ప్రతాపం చూపింది. దాదాపు వంద గ్రామాలు తుపానులో కొట్టుకుపోయాయి. 14,204 మంది మరణించారు. 34 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వ లెక్కల కంటే ఎంతో ఎక్కువగా, 50,000 మందికి పైగా మరణించి ఉంటారని నాడు దేశాన్ని ఢిల్లీ గద్దె నుంచి పాలించిన జనతా పార్టీ ప్రభుత్వం ప్రకటించింది.
చిమ్మ చీకట్లో ఉధృతంగా విరుచుకుపడ్డ ఉప్పునీటి ప్రవాహంలో అనేకమంది కొట్టుకుపోతూ.. తుమ్మ ముళ్ల కంపలకు చిక్కుకుని వేలాదిమంది రాకాసి ముళ్ల కాట్లకు ప్రాణాలు వదిలారు. పశుపక్ష్యాదులు సైతం మృత్యువాతపడ్డాయి. 148 కిలోమీటర్ల వేగంతో వీచిన ప్రచండ గాలులకు భారీ వృక్షాలు సైతం కూకటివేళ్లతో పెకిలించబడి నేలకొరిగాయి. ఇనుప విద్యుత్ స్తంభాలు విల్లుల్లా వంగిపోయాయి. పలు గ్రామాలు శ్మశాన దిబ్బలుగా మార్చింది. శవాల గుట్టల మధ్య తమవారి ఆనవాళ్లను వెతికేందుకు బతికిఉన్న జీవచ్చాలు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. అధికారికంగా ఈ ఉప్పెనలో దాదాపు 14,204 మంది చనిపోయారని రికార్డులు నమోదు కాగా, అనధికారికంగా 50 వేల మంది చనిపోయారని ఒక అంచనా. ఆనాడు దాదాపు 25 వేల హెక్టార్లలో కోతలకు వచ్చిన బంగారు వరి పంటలు సర్వ నాశనం అయ్యాయి.
కోడూరు మండలంలోని పాలకాయతిప్ప, హంసలదీవి, ఇరాలి, ఊటగుండం, గొల్లపాలెం, బసవవానిపాలెం, ఉల్లిపాలెం..నాగాయలంక మండలంలోని ఏటిమోగ, సొర్లగొంది, ఎదురుమొండి, సంగమేశ్వరం, నాచుగుంట, ఏలిచట్ల దిబ్బ తదితర మత్స్యకార గ్రామాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు గుళ్ళల్లో, పాఠశాలల్లో ఆశ్రయం పొంది ప్రాణాలు కాపాడుకున్నారు. కృష్ణాజిల్లా నాగాయలంక మండలం భావదేవరాపల్లి గ్రామాంలోని భావనారాయణ స్వామి ఆలయంలో 2 వేల మంది ప్రజలు దాక్కొని తమ ప్రాణాలు కాపాడుకున్నారు. అలాగే ఆ సమీపంలోని మందపాకల గ్రామంలో పంచాయితీ కార్యాలయంలో 80 గ్రామస్తులు బిక్కు బిక్కుమంటూ ఉప్పెన రాత్రి కాలం గడిపేరు. కళ్ళముందు తమ కుటుంబ సభ్యులు. బంధుమిత్రులు..గ్రామస్తులు బలమైన సముద్ర కెరటాలతో రక్షించమంటూ హాహాకారాలు చేస్తూ కొట్టుకుపోతుంటే .వారిని రక్షించలేక నిస్సహాయంగా ఎందరో ఉండిపోయారు. ఎందరో నీటి సుడులలో కొట్టుకుపోతూ తాడిచెట్లకు చిక్కుకొని ఆఖరి క్షణాలలో ప్రాణాలు దక్కించుకొన్న అదృష్టవంతులు సైతం ఉన్నారు
నవంబర్ 20 వ తారీఖు కృష్ణాతోపాటు గుంటూరు, విశాఖపట్నం , శ్రీకాకుళం ,నెల్లూరు ,ఖమ్మం , తూర్పు , పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఈ ఉప్పెన ప్రభావం కనిపించింది. గుంటూరు జిల్లాలోని రేపల్లె, నిజాంపట్నం తదితర గ్రామాలు ప్రళయం ధాటికి దెబ్బతిన్నాయి.
బందరు సమీపంలోని రంగనాయకం పేట ( నేటి శారదా నగర్ ) పల్లె తుమ్మలపాలెం ఉప్పెన తాకిడికి గురయ్యింది. అనేక గ్రామాలు …పట్టణాలతో ప్రజలకు సంబంధాలు తెగిపోయాయి. నెలల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది..సురక్షిత తాగునీరు ప్రజలకు లభ్యం కాలేదు..రోడ్లకు అడ్డంగా అనేక విద్యుత్ , టెలిఫోన్ స్థంభాలు, భారీ వృక్షాలు కూలి పోయాయి. దివిసీమ ఒక పెద్ద మృతులదిబ్బ మాదిరిగా మారింది. నవంబర్ 21వ తేదీ సోమవారం రాష్త్ర ప్రభుత్వం రిలీఫ్ ఫండ్ ప్రకటించింది. ఉప్పెనలో ప్రాణ,ఆస్తి నష్టం సంభవించిన బాధితులకు ఆర్ధిక సహాయం పునరావాసం ఏర్పాటుచేస్తానని ప్రకటించినప్పటికీ వారాలు గడిచినా అందలేదని ఆ సహాయంలో తీవ్ర జాప్యం జరగడం ఇదే అదునుగా భావించిన కొందరు అధికారులు మానవత్వం మరిచి బాధితులకు డబ్బు పంపిణీలో తమ చేతివాటం చూపించారని ఆనాడు పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి.
బియ్యం, పాలు, బ్రెడ్ తదితర నిత్యావసరాలు పెద్ద ఎత్తున చేరుకొన్నప్పటకి ఎన్నో గ్రామాలకు చేరుకొనేందుకు రవాణా సౌకర్యం లేదు. దీంతో ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఎం.ఐ.-4 హెలికాఫ్టర్ రంగంలోకి దిగాయి. 150 మీటర్ల ఎట్టు నుంచి ఆహార పొట్లాలు ..నీటి ప్యాకెట్లు ప్రజలకు పంపిణీ చేశారు. హెలికాఫ్టర్ నేలపై దిగేందుకు సరైన ప్రాంతం కూడా లేదంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఊహించుకోవచ్చు. ఉప్పెన తీవ్రతకు దివిసీమలో ముళ్ళకంపల్లో చిక్కుకొని వందల సంఖ్యలో నాడు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వారిని వెలుపలకు తీసే పరిస్థితులు లేకపోవడంతో వివిధ హత్యా నేరాలలో రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్షలు అనుభవిస్తున్న 50 మంది కరుడుకట్టిన నేరస్తులను దివిసీమకు తరలించారు. వారిని శవ దహనాలకు ఉపయోగించారు. వారు ముక్కు మూతులకు జేబురుమాళ్ళు కట్టుకొని తుమ్మ చెట్లలలో దూరి కుళ్ళి దుర్వాసన కొడుతున్న మృతదేహాలను మోసుకొంటూ వెలుపలకు తీసుకువచ్చి సామూహిక దహనాలు నిర్వహించారు. నాడు ఖైదీల అమూల్య సేవల కారణంగా తీర ప్రాంతాలలో భీతావహ వాతావరణం తొలిగిపొయింది.
ఉప్పెన అనంతరం వివిధ కమ్యూనికేషన్స్ పునరుద్దరణకు ఎంతో కాలం పట్టింది. అధికారులు వైర్ లెస్ సెట్ల సహాయంతో పునరావాస పనులు చక చకా నిర్వహించారు. ఆర్మీ ఇంజినీర్లు పెద్ద డీజిల్ మోటార్ల సహాయంతో చెరువులలో చేరిన సముద్రం నీటిని వెలుపలకు పంపించారు. వివిధ గ్రామాలలో తాగునీటి అవసరాలకు ఎన్నో బోర్ పంపులు ఏర్పాటుచేశారు. కలరా తదితర అంటువ్యాధులు ప్రబలకుండా ఆర్మీ డాక్టర్లు ప్రజలకు వ్యాధి నిరోధక టీకాలు.. మందులు పంపిణీ చేశారు. ఇక ఈ ఘోర ఉప్పెన ధాటికి బలైపోయిన ప్రజల దుస్థితికి చలించిపోయిన ఎన్నో ప్రపంచ దేశాలు పెద్ద మనస్సుతో స్పందించాయి. అమెరికా , బ్రిటన్ , వెస్ట్ జర్మనీ , కెనడా , శ్రీలంక తదితర దేశాలు పెద్దఎత్తున సహాయపడ్డాయి. పాకిస్తాన్ సైతం రూ.15 లక్షల విలువ చేసే తక్షణమే నిర్మించుకునేలాంటి పెద్ద గుడారాలను మన ప్రాంతానికి పంపింది. బంగ్లాదేశ్ వైద్య బృందాన్ని పంపింది. ఇక ప్రపంచంలోని పలు అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు సహాయపడేందుకు ముందుకొచ్చాయి. రెడ్ క్రాస్, ఆక్స్ఫామ్ అండ్ కేర్ వంటి సంస్థలు బాధితుల వద్దకు నేరుగా చేరుకొన్నాయి. తమవారిని పోగొట్టుకొని వేలాదిమంది రైతులు,మత్య్సకారులు, నేతపనివారు తిరిగి గ్రామాలలో అడుగుపెట్టేందుకు తమ తమ వృత్తులు తిరిగి కొనసాగేందుకు ఎంతో జంకారు.
తుపాను కలిగించిన తీవ్ర నష్టం ఆంధ్ర ప్రదేశ్ తీరం పొడవునా వాతావరణ హెచ్చరిక కేంద్రాల ఏర్పాటుకు దారితీసింది. శాశ్వత తుపాను సహాయ శిబిరాలను తీరం పొడవునా ఏర్పాటు చేసారు. ఉప్పెన బారిన పడిన చిట్టచివరి గ్రామంలో తుపాను మృతుల స్మారకాన్ని నిర్మించారు. తుపాను కలిగించిన ధన, ప్రాణ నష్టాలను కప్పిపుచ్చి తక్కువ చేసి చూపించారని అధికారులు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం తన నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇలా తక్కువ చేసి చూపించారని రాష్ట్రంలో ప్రతిపక్షమైన జనతా పార్టీ ఆరోపించింది. ఈ ఆరోపణల కారణంగా ఐదుగురు ఉన్నతాధికారులు తమ పదవులకు రాజీనామా ఇచ్చారు. బాధితులు త్వరగా కోలుకొనేందుకు చాలావరకు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం కృషి చేసింది.