కేసీఆర్‌ నాయకత్వంలో ప్రగతి ప్రయాణం ప్రారంభించిన తెలంగాణ రాష్ట్రం ఈ ఆరేండ్ల కాలంలో అనేక విజయాలు సాధించింది. ఇది మనం చెప్పుకొనేది కాదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, మంత్రులు చేస్తున్న ప్రశంసలే దీనికి సాక్షి. మన కండ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధి దీనికి సాక్షి. గణాంకాలు దీనికి సాక్షి. మారిన మన జీవన నాణ్యత దీనికి సాక్షి. పెరిగిన మన ఆస్తుల విలువ దీనికి సాక్షి.

ఇల్లలుకగానే పండుగ కాదు. రాష్ట్రం రాగానే అన్నీ కుదిరిపోవు. కొత్త ఇల్లు సదురుకున్నట్టు సదురుకోవాలి. ఇప్పుడదే జరుగుతున్నది. రాష్ట్రం వచ్చాక మనం బాగుపడ్డామా? చెడిపోయామా? రెండుసార్లు మనం ఓటేసి గెలిపించుకున్న ప్రభుత్వం మనకు ఎంతోకొంత మంచి చేసిందా? చెరుపు చేసిందా? ఇంతగా ఎవరన్నా చేశారా? ఇంతకన్నా ఎవరైనా చేశారా? మనం చెడులోకి జారిపోతున్నామా? మంచివైపు మరలుతున్నామా? ఆరేండ్ల కిందటి దాకా మన సమాజంలో ఉన్న ఆందోళన, అరాచకం, అశాంతి ఇప్పుడున్నాయా? మనకు మనమే ఆలోచించుకోవాలి. తెలంగాణ వస్తే రాజకీయ సుస్థిరత ఉండదన్నారు. మనకు పరిపాలన రాదన్నారు. హైదరాబాద్‌ ఖాళీ అవుతుందన్నారు. కంపెనీలు పారిపోతాయన్నారు. కరంటు లేక చీకట్లు అలుముకుంటాయన్నారు. రియల్‌ ఎస్టేట్‌ పడిపోతుందన్నారు. పొలాలకు నీళ్లులేక, మనకు వ్యవసాయం చేయరాక జనం ఆకలి చావులు చస్తారన్నారు. మళ్లీ అదే పాచిక, ఏదో జరుగుతుందని భయపెట్టే ప్రయత్నం. మరి అవన్నీ జరిగినవా? జరగలేదు కదా. జరగనివ్వలేదు కదా!

వంద మేకల్నీ, గొర్రెల్నీ చంపి తినేసిన ఒక తోడేలు,.. నూటా ఒకటో మేకపిల్ల భయంతో పారిపోతుంటే ధైర్యం చెప్పిందట. నీకు నేను రక్షణగా ఉంటాను, భయపడకూ అని అభయ మిచ్చిందట. తోడేలు మాట మేకపిల్ల నమ్మేస్తే ఏమవుతుంది?

చెరువు కట్ట మీద ముసలి పులి కూర్చుని వున్నది. దాని చేతిలో ఒక బంగారు కడియం మెరుస్తున్నది. మిమ్మల్ని ఉద్దేశించి ఏదో చెబుతున్నది. వృద్ధాప్యం వల్ల జీవహింస మానేసిందట. శాకాహారిగా మారిందట. పూర్వం చేసిన పాపాలను పరిహారం చేసుకునేందుకు ఆ కడియం మీకిస్తుందట. నమ్ముతారా? దగ్గరకెళ్లి తీసుకుంటారా? తేల్చుకోండి మిత్రులారా!

మీరు చదివిని తొలి రెండు పేరాలు టీఆర్ఎస్ పార్టీ కరదీపిక ‘నమస్తే తెలంగాణా’ పత్రిక ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి కృ.తి. కాలమ్ ద్వారా ‘దేనిని కోరుకుందాం ?’ శీర్షికన శనివారం రాసిన భారీ వ్యాసంలోని భాగాలు. ఆ తర్వాత గల రెండు పేరాలు గతనెల 21న ‘ఒక దళారీ ప్రవచనం!’ శీర్షికన ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ వర్దెల్లి మురళీ గౌడ్ రాసిన వ్యాసంలోనివి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తిగుళ్ల కృష్ణమూర్తి తన వ్యాసం ద్వారా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని బాహాటంగానే చెప్పినట్లయింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రయివేటీకరణకు వ్యతిరేంకగా పోరాటం చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పిలుపునిచ్చిన సందర్భంగా సాక్షి పత్రిక ఎడిటర్ వర్దెల్లి మురళీ గౌడ్ ఆయన పిలుపును చీల్చి చెండాడుతూ, ఖండ ఖండాలుగా ఖండిస్తూ రాసిన వ్యాసం ఆద్యంతం చర్చనీయాంశమే. అంతేకాదు చంద్రబాబు పిలుపును ‘దళారీ ప్రవచనం’గా అభివర్ణిస్తూ శీర్షీకరించడం కూడా గమనార్హం.

ఇప్పుడీ రెండు పత్రికల ఎడిటర్ల వ్యాసాల ప్రస్తావన దేనికంటే… ప్రస్తుత పత్రికల్లో కొందరు ఎడిటర్ల పాత్ర మారిపోతున్నది. ఓ నార్ల వెంకటేశ్వర్ రావునో, పంతజలినో, గజ్జెల మల్లారెడ్డినో, పొత్తూరు వెంకటేశ్వర్ రావునో, రాఘవాచారినో… మరెవరో సత్తెకాలపు సత్తెయ్య లాంటి ఎడిటర్లను నేటి జర్నలిజంలో గుర్తుకు తెచ్చుకోవలసిన అవసరం కలగకపోవచ్చు. యాజమాన్యాల విషయానికి వస్తే ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు సంస్థల చైర్మెన్ దివంగత రామ్ నాథ్ గోయెంకాను కూడా మననం చేసుకోవలసిన అవసరం రాకపోవచ్చు. పక్కా పచ్చ పత్రికగా ప్రాచుర్యం పొందిన ‘ఈనాడు’ రామోజీరావు కూడా బహుషా ఈ తరహాలో చంద్రబాబును కీర్తిస్తూ కనీసం ‘సైన్డ్’ ఎడిటోరియల్ రాసి ఉండకపోవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ తన, విధానమేంటో, వైఖరేమిటో కుండబద్దలు కొట్టినట్లుగానే చెబుతుంటారు. రామోజీ, రాధాకృష్ణలు తమ పత్రికలకు యజమానులు. ఇటువంటి యాజమాన్యాలకు వ్యాపార ప్రయోజనాలు ఉండొచ్చు. కానీ ఏబీకే ప్రసాద్, పతంజలి వంటి ఎడిటర్లు ఏ ప్రయోజనాలను ఆశించిన దాఖలాలు లేవు. తమ భావాలకు విరుద్ధంగా, యాజమాన్యాల మెప్పుకోసం వ్యవహరించడానికి మనస్కరించని ఏబీకే, పతంజలి వంటి ఎడిటర్లు తమ ఉద్యోగాలను గడ్డిపోచతో సమానంగా విసిరేసిన దాఖాలాలు ఉన్నాయి.

కానీ తెలుగు మీడియాలో పత్రికల పోకడలు మారిపోయాయి. రాజకీయ పార్టీల రంగులను పత్రికా యాజమాన్యాలే కాదు, టీవీ ఛానళ్ల మేనేజ్మెంట్లు సైతం బాహాటంగానే పూసుకుంటున్నాయి. అందుకే కాబోలు యెల్లో, పింక్, బ్లూ, కాషాయ మీడియాలుగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ప్రజా ప్రయోజనం, పాఠక ప్రయోజనం అప్రస్తుతం. వ్యాపార ప్రయోజనమే అసలు సూత్రం. అందుకే కాబోలు వర్తమాన ఎడిటర్ల కలాల రీతి మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వామపక్ష భావజాల కుటుంబానికి చెందిన వర్దెల్లి మురళీ గౌడ్ చంద్రబాబును ‘దళారి’గా అభివర్ణిస్తూ, తిగుళ్ల కృష్ణమూర్తి సీఎం కేసీఆర్ ను కీర్తిస్తూ, టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాలని చెప్పకనే చెబుతూ తమ వ్యాసాలను ప్రచురించుకుంటున్న తీరును తప్పుపట్టాల్సిన అవసరం లేనేలేదు. ఎందుకంటే ప్రస్తుత జర్నలిజంలో ఎడిటర్ హోదాలోనూ అధికార పార్టీల లక్ష్యాలను, జెండాల రంగును, ఎజెండాల లక్ష్యాలను ప్రవచించక తప్పని తిప్పలుగానే జర్నలిస్టు సర్కిళ్లు అభివర్ణిస్తున్నాయి. మరీ ఇంతగా ‘ప్రవచనం’ చెప్పే వర్తమాన ఎడిటర్లకు మున్ముందు దక్కే ప్రయోజనం ఏమిటనే ప్రశ్నలు అస్సలు అక్కర లేదు. పాలకవర్గ పెద్దలు ఇటువంటి ప్రవచనాలకు సంతసిస్తే ప్రభుత్వంలో ఏదేని కీలక పదవి దక్కవచ్చని, అవసరమైతే ప్రత్యేక పోస్టులు కూడ క్రియేట్ చేసి అందలం ఎక్కించే అవకాశాలు అనేకమంటున్నారు. ఎందుకంటే ‘చంద్రబాబును ప్రధానిగా చూడాలనే కోరిక ఉంది’ అని తన వ్యాసం ద్వారా గతంలో ప్రవచించిన ఓ ‘పెద్దాయన’కు జగన్ ప్రభుత్వంలో కీలక పదవి లభించడమే ఇందుకు నిదర్శనంగా మీడియా వర్గాలు చెబుతుంటాయి. అందువల్ల చెప్పొచ్చేదేమిటంటే… వర్దెళ్లి మురళి, తిగుళ్ల కృష్ణమూర్తి వంటి వర్తమాన ఎడిటర్లు నేటి తరం జర్నలిస్టులకు మార్గదర్శకులు.., ఆదర్శనీయులు.., అనుసరణీయులు.., స్ఫూర్తి ప్రదాతలు అని…!

Comments are closed.

Exit mobile version