పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఓ ఎన్కౌంటర్లో క్రాస్ ఫైరింగ్ కారణంగా గ్రామస్తుడు ఒకరు మృతి చెందారు. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా మోడక్పాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓట్కల్ పాడ్ అడవుల్లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెడతే ఓట్కల్ పాడ్ అడవుల్లో గాలింపు చర్యలు చేపడుతున్న పోలీసులకు ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో మావోయిస్టు నక్సల్స్ తారపడ్డారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి.
అయితే ఇదే సమయంలో ఓట్కల్ పాడ్ గ్రామానికి చెందిన ఇద్దరు సామాన్య పౌరులు ఇరువర్గాల కాల్పుల్లో చిక్కుకున్నారు. క్రాస్ ఫైరింగ్ కారణంగా ఇద్దరు గ్రామస్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసు అధికారులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూనే ఓ గ్రామస్తుడు మరణించాడు. గాయపడిన మరో గ్రామస్తునికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనను బీజాపూర్ ఎస్పీ కమలోచన్ కశ్యప్ ధృవీకరించారు.
అయితే నక్సల్, పోలీసుల మధ్య జరిగిన కాల్పుల మధ్యలోకి గ్రామస్తులు ఎందుకు వచ్చారు? పొయిల కట్టెల కోసంగాని, అటవీ ఉత్పత్తుల సేకరణ కోసంగాని వచ్చారా? అనే అంశాలపై స్పష్టత లేదు.