ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ బీ ఫారంపై గెలిచిన తర్వాత ఎవడైన పార్టీ మారితే… వాడిని రాళ్లతో కొట్టి చంపాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుపై పలువురు ‘మాజీ కాంగ్రెస్’ ఎమ్మెల్యేలు మండి పడ్డారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచి, ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు రేవంత్ పిలుపుపై తీవ్ర స్థాయిలో స్పందించారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బదులిస్తూ, ఆయన రాళ్లతో కొడితే తాము చెప్పులతో కొడతామని వ్యాఖ్యానించారు. ఎల్పీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈ అంశంపై మీడియాతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు.

ఎమ్మెల్యేల పేరున విడుదలైన ప్రకటన చివరి పేజీ ఇదే

ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై గెలిచి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న డజన్ మంది ఎమ్మెల్యేలు ఓ పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. సబితా ఇంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి, రేగ కాంతారావు, జాజుల సురేందర్, హరిప్రియ, గండ్ర వెంకట రమణారెడ్డి, ఆత్రం సక్కు, చిరుమర్తి లింయ్య, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, కందాల ఉపేందర్ రెడ్డి, వనమా వెంకటేశ్వర్ రావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిల పేర్లతో మూడు పేజీల సంయుక్త పత్రికా ప్రకటనను విడుదల చేశారు. అయితే ఇందులో ఏ ఒక్క ఎమ్మెల్యే సంతకం కూడా ఆయా ప్రకటనపై లేకపోవడం గమనార్హం. సంతకాలు లేకుండా విడుదలైన ఈ ప్రకటన భిన్న చర్చకు దారి తీసింది.

Comments are closed.

Exit mobile version