మార్చి 17 నుంచి కేంద్రం విధానాలపై ‘ప్రజాగర్జన.‘
మూడు బృందాలుగా కొనసాగనున్న యాత్రలు
బీజేపీ వ్యతిరేక శక్తుల సమీకరణ సీపీఎం లక్ష్యం
రాజకీయ వైఖరి రీత్యా బీఆర్ఎస్ తో మైత్రి
సీపీఎం ఖమ్మం జిల్లా విస్తృత సమావేశంలో
రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
బీజేపీ ప్రమాదం ముంచుకొస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నూతన ఆర్థిక విధానాలను మరింత వేగంగా అమలు చేస్తూ ప్రభుత్వ రంగ కంపెనీలను ప్రైవేటుకు ధారా దత్తం చేస్తున్నదని ధ్వజమెత్తారు. బీజేపీ వ్యతిరేక శక్తుల సమీకరణే లక్ష్యంగా పార్టీ ముందుకెళ్తోందన్నారు. రాజకీయ వైఖరీ రీత్యానే బీఆర్ఎస్ తో మైత్రి అని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఎం జాతీయ కమిటీ పిలుపు మేరకు మార్చి 17వ తేదీ నుంచి ప్రజా గర్జన యాత్రలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మూడు బృందాలుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రారంభమయ్యే ఈ జాతాను విజయవంతం చేయాల్సిందిగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 21వ తేదీన ఏన్కూరులో జిల్లాలోకి ప్రవేశించే యాత్ర 25వ తేదీ వరకు కొనసాగుతుందని చెప్పారు. స్థానిక మంచి కంటి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృత సమావేశంలో తమ్మినేని మాట్లాడారు.
కార్పొరేట్ తొత్తుగా మారిన బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఈ యాత్ర కొనసాగుతుందని తమ్మినేని స్పష్టం చేశారు. మార్చి 17న తన సారథ్యంలో హనుమకొండలో ప్రారంభమయ్యే యాత్రను జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభిస్తారని చెప్పారు. ఆదిలాబాద్, నాగర్ కర్నూల్ నుంచి మరో రెండు బృందాలు యాత్రలు నిర్వహిస్తాయన్నారు. మార్చి 30వ తేదీ నాటికి హైదరాబాదులోని తుర్కయంజాల్ ప్రాంతానికి చేరుకుంటాయని తెలిపారు. బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండకట్టడమే యాత్రల ప్రధాన ఉద్దేశంగా చెప్పారు. బిజెపి పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది అన్నారు. కార్పొరేట్లకు తొత్తుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఏటేటా దిగజారుతుందన్నారు. మరోవైపు మోడీ స్నేహితుడు అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడని తెలిపారు. అక్రమ పద్ధతిలో మోడీ ప్రభుత్వం అందించిన సహకారంతోనే అదానీ ఆ స్థాయికి ఎదిగాడని హిండెన్ బర్గ్ నివేదిక స్పష్టం చేసిందన్నారు. ఈ నివేదికతో అదానీకి చెందిన రూ.12 లక్షల కోట్లు ఆవిరయ్యాయని తెలిపారు. మోడీ సహకారంతో గణనీయంగా పెరిగిన అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువను చూపి రూ. లక్షల కోట్ల రుణాలు సేకరించారని వివరించారు. ఒక్క ఎల్ఐసి నుంచే రూ.80వేల కోట్ల రుణాలు తీసుకున్నట్లు తెలిపారు. హిండెన్ బర్గ్ నివేదికతో ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ మూడు నుంచి 30వ స్థానానికి దిగజారినట్లు చెప్పారు. బిజెపి వ్యతిరేక పక్షాలను బెదిరించేందుకే ఈడీని వాడుకుంటున్నదని, సుప్రీం జోక్యం చేసుకోకపోయి ఉంటే… అదాని అక్రమాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుకు బిజెపి అంగీకరించేది కాదన్నారు.
మరోవైపు గ్యాస్, ఎరువుల సబ్సిడీ, ఉపాధి నిధుల్లో కేంద్రం కోత పెడుతుందన్నారు. ఆర్యులే భారతీయ హిందువులుగా చరిత్ర వక్రీకరణకు బిజెపి పూనుకుంటుందన్నారు. ఉత్తరాదిలో వస్తున్న వ్యతిరేకతను దక్షిణాదిలో పూడ్చుకోవాలని బిజెపి ప్రయత్నిస్తోందన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి భాగ్యలక్ష్మి ఆలయం మీద ఉన్న ప్రేమ, సచివాలయం గోపురాలు కూల్చడంపై ఉన్న శ్రద్ధ, ప్రజా సమస్యలపై లేదన్నారు. చాతుర్వరణ వ్యవస్థను పునఃస్థాపించటమే బీజేపీ ధ్యేయమన్నారు. బిజెపి వ్యతిరేక శక్తుల సమీకరణ జాతీయ కమిటీ నిర్ణయంగా పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బిఆర్ఎస్ నెగ్గకపోయి ఉంటే.. అసంతృప్త నేతలు బిజెపి దారి పట్టే వారని అన్నారు. రాజకీయ వైఖరి రీత్యా బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చామన్నారు. ఈసారి తెలంగాణ శాసనసభలో సిపిఎం అడుగుపెట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు కర్తవ్యాలను పార్టీ సభ్యులకు ఉద్బోధించారు