మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాజకీయ సలహా ఇచ్చారు. ఈటెల రాజేందర్ బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకోవడం చాలా అభ్యంతరకరమని ఆయన అన్నారు. మొదటి నుంచీ ఈటెల వామపక్షవాదిగా ప్రారంభమై, ఆ తర్వాత లౌకిక ప్రజాస్వామ్యవాదిగా మారి… ఇప్పుడు పచ్చి ఫాసిస్టు సిద్ధాంతాల సంస్థ వెనుక ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ వెనకుండి నడిపిస్తున్న బీజేపీ పార్టీలో చేరడమనేది సిగ్గు పడాల్సిన విషయంగా తమ్మినేని అభివర్ణించారు. పైగా తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి కమ్యూనిస్టులపైన విమర్శలు చేయడం, నిందలు వేయడమనేది చాలా తప్పు పద్ధతని, దీన్ని ఖండిస్తున్నానని తమ్మినేని పేర్కొన్నారు. బీజేపీ ఈరోజున ప్రజా కంఠకంగా పరిపాలిస్తోందని, దేశంలో ఏర్పడిన ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేకపోయిందని, కోవిడ్, ఆర్థిక సంక్షోభాలు ఎంత తీవ్రంగా ముందుకొచ్చాయో మనకు తెలుసన్నారు. ఇట్లాంటి దుర్మార్గమైన పార్టీలో చేరడానికి ఈటెలకు మనసెలా వచ్చింది? అని ప్రశ్నించారు. బీజేపీలో చేరడం ద్వారా ఈటెల తన రాజకీయ భవిష్యత్తును చూసుకుంటున్నాడేమో తప్ప, లౌకిక విలువలను, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మాత్రం కాదన్నారు. తెలంగాణా గురించి, తెలంగాణా భావాల గురించి చెబుతున్నారని, నిజంగా తెలంగాణా లౌకికతత్వంపట్ల, వామపక్ష భావాలపట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా, తెలంగాణా ప్రజల పట్ల గౌరవం ఉన్నా… ఇప్పటికైనా బీజేపీలో చేరే విషయాన్ని పునరాలోచించుకోవడం మంచిదని ఈటెల రాజేందర్ కు సలహా చెబుతున్నట్లు తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.