పశు వాంఛ.. పశువులా కోరికను తీర్చుకునే కామాంధులకు అన్వయించే వ్యాఖ్య ఇది. కానీ పశువులపైనే తన కామ వాంఛను తీర్చుకునేవాడికి ఏ పదం వాడాలి? పశు వాంఛ అనే పదం కూడా సరిపోదేమో.. ఈ సంఘటన గురించి చదివాక.
కేరళలోని పాలక్కడ్ జిల్లా మన్నార్ కడ్ సమీపంలో గల మాసాపరంబు గ్రామానికి చెందిన వినోద్ పాల వ్యాపారం చేస్తుంటాడు. ఈనెల 6వ తేదీన తన పశు సంపదలోని ఓ ఆవు అదృశ్యమైంది. పశువులన్నాక తప్పించుకుంటూనే ఉంటుంటాయి. వాటి యజమానులు పరిసర గ్రామాల్లో వెతుకుతూనే ఉంటారు. పశు పోషణలో వాటి యజమానులకు ఇది సర్వ సాధారణమే. వినోద్ కూడా అదే పని చేశారు. చుట్టుపక్కల గల అనేక గ్రామాల్లో వినోద్ ఎంతగా గాలించినా అతని ఆవు ఆచూకీ మాత్రం లభించలేదు.
అయితే బుధవారం ఉదయం గ్రామ శివార్లలోని ముళ్ల పొదల్లో వినోద్ కు చెందిన ఆవు విగతజీవిగా కనిపించింది. ఆవు మర్మాంగాల మీద గాయాలున్నట్లు గ్రహించిన వినోద్ తన ఆవు మృతిపై గల సందేహాలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఆవుపై లైంగిక దాడి జరిపి చంపేశారన్నది వినోద్ పోలీసులకు చేసిన ఫిర్యాదు సారాంశం. దీంతో పాలక్కడ్ ప్రాంతంలో ఒకటే కలకలం.
వినోద్ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆవు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పశువులాసుపత్రికి తరలించారు. పశు వైద్యులు ఆవుకు పోస్ట్ మార్టం చేసినప్పటికీ నివేదికను మాత్రం బహిర్గతం చేయలేదు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాతే వాస్తవాలు వెల్లడిస్తామని పోలీసులు ప్రకటించినట్లు జాతీయ వార్తా సంస్థలు నివేదించాయి.