కరోనా చికిత్సలో ప్రయివేట్ ఆసుపత్రుల వ్యవహారతీరుపై తెలంగాణా ప్రభుత్వం కొరడా ఝళిపించింది. హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రుల కోవిడ్ చికిత్స లైసెన్స్ ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ చికిత్స లైసెన్స్ రద్దయిన జాబితాలో కూకట్ పల్లిలోని మ్యాక్స్, సనత్ నగర్ లోని నీలిమ, కాచిగూడలోని టీఎక్స్, బేగంపేటలోని విన్, బంజారహిల్స్ లోని విరించి హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కరోనా పేషెంట్ ఒకరికి చికిత్స అందించిన విషయంలో తీవ్ర వివాదాస్పదమైన హైదరాబాద్ లోని విరించి ఆసుపత్రికి కోవిడ్ చికిత్స అనుమతిని ప్రభుత్వం రద్దు చేసింది. ఈమేరకు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఉత్తర్వు జారీ చేశారు. నల్లగొండ జిల్లాకు చెందిన వంశీకృష్ణ బంధువులు ఇచ్చిన ఫిర్యాదుపై ఆసుపత్రి యాజమాన్యాన్ని సంజాయిషీ కోరామని, ఇందుకు 24 గంటల వ్యవధి కూడా ఇస్తూ షాకాజ్ నోటీసు ఇచ్చినట్లు చెప్పారు. అయితే నోటీసుకు సంజాయిషీ ఇవ్వడంలో విరించి ఆసుపత్రి నిర్వాహకులు సంజాయిషీ ఇవ్వడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. దీంతో కోవిడ్ పేషెంట్ కు నిర్లక్ష్యపు వైద్యం చేశారని తమకు అందిన ఫిర్యాదు మేరకు, ప్రజాప్రయోజనాలను దృష్ట్యా, విరించి ఆసుపత్రి కోవిడ్ చికిత్స అనుమతిని రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులో వివరించారు. ఉత్తర్వు ప్రతిని దిగువన చూడవచ్చు.

Comments are closed.

Exit mobile version