కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ వచ్చే ఆగస్టు నెలలోనే ప్రారంభం కానుందా? అనే ప్రశ్నకు ఔనంటోంది భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్ బీ ఐ) తాజా నివేదిక. దేశంలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు తప్పదని ఆరోగ్య రంగ నిపుణులు ఇప్పటికే స్పష్టం చేశారు కూడా. ఈ నేపథ్యంలోనే వచ్చే ఆగస్టు నెలలో కరోనా థర్డ్ వేవ్ ప్రభావం ప్రారంభమయ్యే అవకాశముందని, సెప్టెంబర్ నెలలో ఇది గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేస్తూ ఎస్ బీ ఐ నివేదిక అప్రమత్తం చేసింది. దేశంలో కరోనా తీవ్రత, ఉధృతి, బ్యాంకింగ్, ఆర్థిక రంగ వ్యవస్థలపై ప్రభావం తదితర అంశాలపై ఎస్ బీ ఐ నిపుణుల బృందం ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ అంచనా వేస్తోంది.

ఇందులో భాగంగానే ‘కొవిడ్-19 ది రేస్ టు ఫినిషింగ్ లైన్’ శీర్షికన తాజాగా తన ఇన్వెస్టిగేటివ్ రిపోర్టును విడుదల చేసింది. కరోనా సెకండ్ వేవ్ మే 7వ తేదీ నాటిక పీక్ స్టేజ్ కు చేరుకుందని, ప్రస్తుత గణాంకాలను పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తే ఈనెల రెండో వారానికల్లా రోజువారీ కేసుల సంఖ్య పది వేల కనిష్టానికి చేరుకుంటుందని వెల్లడించింది. అయితే ఇదే దశలో ఆగస్టు రెండో పక్షం నుంచి కేసుల సంఖ్య క్రమంగా పెరగవచ్చని అంచనా వేస్తూ హెచ్చరించడం గమనార్హం. ఇందుకు సంబంధించిన మరికొన్ని అంశాలను కూడా ఎస్ బీ ఐ తన నివేదికలో వెల్లడించింది.

Comments are closed.

Exit mobile version