కరోనాతో సహజీవనం చేస్తున్న మన దేశ ప్రజలందరూ ఊపిరి పీల్చుకోవలసిన శుభవార్త ఇది. వచ్చే అక్టోబర్ నెలాఖరుకల్లా కరోనా వ్యాక్సిన్ వచ్చేస్తోంది. నేటికి సరిగ్గా 73 రోజుల్లో ‘కోవిషీల్డ్’ కరోనా వ్యాక్సిన్ మార్కెట్లోకి వస్తుందని ‘సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ ప్రతినిధులు ‘బిజినెస్ టుడే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం.
నేషనల్ ఇమ్యునైజేష్ కార్యక్రమం కింద భారత ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ ను ఉచితంగానే పంపిణీ చేయనున్నట్లు కూడా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు చేసిన ప్రకటన ప్రాధాన్యతనను సంతరించుకుంది.
ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన తాము ట్రయల్స్ ను వేగవంతం చేశామని, మరో 58 రోజుల్లోనే ఇది ముగుస్తుందని కూడా చెప్పారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనికా సంస్థలు సంయుక్తంగా డెవలప్ చేసిన వ్యాక్సిన్ ను సీరం ఇనిస్టిట్యూట్ తయారీ హక్కులను కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి.
తొలి డోసును శనివారం ఇచ్చామని, రెండో డోసును 29 రోజుల తర్వాత ప్రయోగిస్తామని, అనంతరం 15 రోజుల తర్వాత తుది నిర్ణయం వెల్లడవుతుందని, ఆ తర్వాత ‘కోవిషీల్డ్’ వ్యాక్సిన్ ను మార్కెట్లోకి విడుదల చేస్తామని సీరం సంస్థ ప్రతినిధులు ‘బిజినెస్ టుడే’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.