తెలంగాణాలోని అధికార పార్టీ రాజకీయాల్లో ఇదో అనూహ్య ఘటన. కారణాలు ఏవైనా కావచ్చు… కానీ ఏకంగా ఎమ్మెల్యే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్లు ‘పొలిటికల్ షాక్’నివ్వడం కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ రాజకీయాల్లో సంచలనం. ఎమ్మెల్యే చెబితే వినాలా? అనే తరహాలో కౌన్సిలర్లు వ్యవహరించిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ చర్చకు దారి తీసింది. వివరాల్లోకి వెడితే…
కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపల్ కౌన్సిల్ కో-ఆప్షన్ ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కో-ఆప్షన్ పదవులకు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అధికారికంగా ప్యానెల్ తరపున అభ్యర్థులను పోటీకి దించారు. ఎమ్మెల్యే ప్రతిపాదించిన గొల్లపల్లి ప్రభావతి, ఇంద్రసేనారెడ్డి, జహీర్, షబానాలు ఈ ఎన్నికల్లో పరాజయం పాలు కావడం గమనార్హం. సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్లే తమ నాయకుడి నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఎమ్మెల్యే వర్గీయులు నిర్ఘాంతపోయారు.
ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోటీ చేసిన మహ్మద్ అజ్జు, అమరకొండ తిరుపతి, అమీనా సుల్తానా, గండి లలితలు కో-ఆప్షన్ సభ్యులుగా విజయం సాధించడం విశేషం. వాస్తవానికి చొప్పదండి మున్సిపాలిటీలో మొత్తం 14 మంది కౌన్సిలర్లు ఉండగా, దండె జమున అనే కౌన్సిలర్ శుక్రవారం నాటి ఎన్నికలకు హాజరు కాలేదు.
అయితే కౌన్సిల్లో ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఓటు హక్కు గల ఎమ్మెల్యే రవి శంకర్ ఓటు వేసిన అభ్యర్థుల్లో అమీనా సుల్తానా తప్ప, మిగతా ముగ్గురు ఓటమి పాలు కావడం గమనార్హం అంటే తాను బలపర్చిన మరో అభ్యర్థి సబానాకు ఎమ్మెల్యే కూడా ఓటు వేయలేకపోయారన్నది సుస్పష్టం.
ఇదే దశలో ఎమ్మెల్యే ప్రతిపాదించిన కో-ఆప్షన్ సభ్యుల ప్యానెల్ అభ్యర్థులకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన మెజారిటీ కౌన్సిలర్లు సొంతంగా అభ్యర్థులను పోటీకి దింపి గెలిపించుకోవడం విశేషం. ఎమ్మెల్యే ప్యానెల్ అభ్యర్థుల ఓటమికి బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు సహకరించడం మరో ప్రత్యేకత.
సరిగ్గా ఏడాదిన్నర క్రితం జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన సుంకె రవిశంకర్, ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ కౌన్సిలర్ల విజయానికి పాటుపడ్డారు. తాను బీ ఫారాలు ఇచ్చి గెలిపించుకున్న కౌన్సిలర్లే మున్సిపల్ కో-ఆప్షన్ ఎన్నికల్లో అనూహ్యంగా ఎమ్మెల్యేకు ‘షాక్’నివ్వడం గమనార్హం.
ఆధిపత్య రాజకీయాలా? అధికార పార్టీలో వర్గపోరు ఇందుకు దారి తీసిందా? అనేది అసలు ప్రశ్న కాదు. ఎమ్మెల్యే నిర్ణయానికి కౌన్సిలర్లు ఎదురుతిరిగారనేది కళ్ల ముందు కనిపిస్తున్న దృశ్యం. తెలంగాణాలో అధికార పార్టీ రాజకీయాల్లో ఇదో అనూహ్య ఘటన… అంతే!