హెడ్డింగ్ ఎబ్బెట్టుగా ఉందా..? తప్పదు… ఎందుకంటే ఇదేమీ బూతు కాదు. తెలంగాణా పల్లెల్లో ఎక్కువగా వాడే సామెతల్లో ఇదీ ఒకటి. సంఘటనను బట్టి ప్రస్తావించక తప్పని నానుడి కూడా. ఇంతకీ విషయమేమిటంటే… ఈ మధ్య భారీ వర్షాలకు హైదరాబాద్ మహానగరం అతలాకుతలమైన సంగతి తెలిసిందే కదా! రోజుల తరబడి లోతట్టు ప్రాంతాల ప్రజలు నరకాన్ని చవి చూశారు. వరద నీరు, బురద మట్టితో పడరాని పాట్లు పడ్డారు. ఇప్పటికీ ఈ బురద కంపు ఇంకా కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా తొలగిపోలేదనే వార్తలు కూడా వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే వరద బాధితులకు కేసీఆర్ సర్కార్ కాస్త ఆర్థిక సాయం ప్రకటించింది. ప్రతి బాధిత కుటుంబానికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించి, ప్రస్తుతం నగదు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియలోనూ అనూహ్యంగా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. నల్లకుంట డివిజన్ లోని సత్యానగర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ నగదు పరిహారం విషయంలో అధికారులతో వాగ్వాదానికి దిగారు. అంతేకాదు ప్రభుత్వం తమకు అందిస్తున్న ఆర్థిక సాయం అందడం లేదని దక్షిణ మండల జీహెచ్ఎంసీ ఆఫీసు ముందు బాధితులు కొందరు ధర్నాకు దిగారు.
నల్లకుంట డివిజన్ లో వరద బాధితులకు రూ. 10 వేలకు బదులుగా రూ. 5 వేలు మాత్రమే పంపిణీ చేశారని స్థానికులు మండిపడ్డారు. ఓ యువకుడు ఈ అంశంపై స్థానిక నేతలను ప్రశ్నించగా, నగదు పంపిణీలో ఆటంకం కలిగిస్తున్నాడని యువకునిపైనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే పది వేల మొత్తాన్ని కాకుండా రూ. 5 వేలు మాత్రమే ఎందుకు పంపిణీ చేస్తున్నారనే ప్రశ్నకు మాత్రం సమాధానం లేకుండా పోయిందట.
స్థానిక నాయకులు వరద బాధితులకు నగదు పంపిణీలో అవినీతికి పాల్పడుతున్నారని, మరికొన్ని చోట్ల అసలు సాయమే అందించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. కేసీఆర్ సార్ రూ. 10 వేలు ఇవ్వాలని మంజూరు చేస్తే, అందులో సగం మొత్తాన్ని కొందరు స్థానిక నేతలు నొక్కేస్తున్నారనేది బాధితుల ఆరోపణ. వరదల్లో భారీ నష్టాన్ని చవి చూసిన బాధితులకు అందాల్సిన సాయాన్ని ఇలా స్వాహా చేస్తున్న కొందరు స్థానిక నేతలకు ‘చేతులు నాకే వాడి మూతి నాకడం’ అనే సామెత అన్వయింపు సబబే కదూ!