ప్రజలు చెల్లించే పన్నుల నుంచే వేలకు వేలు జీతాలు తీసుకునే కొందరు కార్పొరేట్ సంస్థలకు అమ్ముడు పోతున్నారు. తద్వారా అదే ప్రజలు గందరగోళానికి గురై ఆర్థికంగా నష్టపోవడానికి కారణం అవుతున్నారు.
ప్రతి సంవత్సరం పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల సెల్ ఫోన్ నెంబర్లకు కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థల నుంచి కాల్స్ వస్తుంటాయి. ప్రస్తుతం కూడా వైజాగ్ లోని ఓ ప్రయివేట్ డిఫెన్స్ అకాడమీ నుంచి కాల్స్ రావడం మొదలైంది. కార్పొరేట్ సంస్థలకు విద్యార్థుల తల్లిదండ్రుల సెల్ ఫోన్ నెంబర్లు ఎలా వెళ్లాయనేదే ఇక్కడ అసలు ప్రశ్న!?
పబ్లిక్ పరీక్షల నిమిత్తం ఫీజులు చెల్లించే క్రమంలో పదవ తరగతి విద్యార్థుల వివరాలతో పాటు తల్లిదండ్రుల సెల్ నెంబర్లను కూడా ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచే ఫోన్ నెంబర్ లు వివిధ సంస్థలకు వెళ్తుంటాయనే ప్రచారం ఉండనే ఉంది. ఇదొక్కటే కాదు, కాంపిటేటివ్ పరీక్షలు రాసే ప్రతి ఒక్కరి సెల్ నెంబర్లకు ఈ విధంగానే కార్పొరేట్ సంస్థల నుంచి కాల్స్ వస్తుంటాయి.
ఇంజనీరింగ్, ఎంబీఎ, ఎంసీఎ కళాశాలల నుంచి విద్యార్థులకు సంబంధించిన అన్ని వివరాలతో కాల్స్ వస్తున్నాయి. ఇలా వచ్చిన కాల్స్ తోనే జాయిన్ అయిన గ్రామీణ ప్రాంత విద్యార్థులు నష్టపోయిన దాఖలాలు కోకొల్లలు.
ఫోన్ కాల్స్ లో వినిపించిన తియ్యని మాటలకు వేలకు వేలు ఫీజులు చెల్లించి జాయిన్ అయిన విద్యార్థులు, అక్కడ ఇమడలేక వారంలోనే తిరుగుముఖం పడుతున్నారు. ముందు చెల్లించిన ఫీజులను తిరిగి ఇచ్చే ఆనవాయితీ కార్పొరేట్ సంస్థలకు లేదనేది అందరికీ తెలిసిందే.
లేచిన దగ్గర నుంచి ప్రతి రోజూ ఇలా ఏదో రకమైన మోసాలతోనే ఈ సమాజం కాలం వెళ్ళ దీస్తుందనడంలో సందేహం లేదు. అందుకే…
తల్లి తండ్రులారా, మీ పిల్లల భవిష్యత్తు కోసం… ఎల్లప్పుడూ తస్మాత్ జాగ్రత్త..!
✍ తుమ్మలపల్లి ప్రసాద్