కరోనా మహమ్మారిని ఆసరాగా చేసుకుని కాసుల కక్కుర్తి దందాకు పాల్పడుతున్నారు కొందరు. ఇటువంటి అంశాల్లో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. హైదరాబాద్ లోని మియాపూర్ ప్రాంతంలో గల హఫీజ్ పేట వాసి ఇస్మాయిల్ బాబా అలియాస్ కరోనా బాబా శైలి మరీ ప్రత్యేకం.
కరోనా అంతానికి వ్యాక్సిన్ కనిపెట్టే దిశగా ప్రపంచ దేశాలు ముమ్మరంగా సీరియస్ కసరత్తు చేస్తున్న పరిస్థితుల్లో మాయలు, మంత్రాలతో కరోనా అంతు చూస్తానంటూ బయలుదేరాడు ఇస్మాయిల్ బాబా. ఈ బాబాకు అతీంద్రీయ శక్తులు ఉన్నాయంటూ అతని శిష్యగణం ప్రచారంలోకి దిగిందట. బాబా మహిమా శక్తుల ధాటికి కరోనా తట్టుకోలేదని, మాస్కులు కూడా పెట్టుకోవలసిన అవసరం లేదని శిష్య బృందం ఊదరగొట్టిందట.
ఇంకేముంది మన జనాలు కొందరు పోలోమని బాబా ముందు మోకరిల్లారు. కరోనాను తగ్గిస్తానంటూ ఇస్మాయిల్ బాబా వైరస్ బాధిత రోగులకు రేటు కూడా నిర్ణయించాడు. ఒక్కో రోగి నుంచి రూ. 40-50 వేల చొప్పున వసూళ్లకు దిగాడు. కరోనా ప్రభావం మొదలైన మార్చి నెల నుంచే బాబా దందా మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 70 మంది కరోనా రోగులను ఇస్మాయిల్ బాబా అలియాస్ కరోనా బాబా ఆర్థికంగా దోచుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
గత రాత్రి కరోనా బాబా డెన్ పై దాడి చేసి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. నిమ్మకాయలు, విభూదితో మంత్ర, తంత్ర పూజలు చేసి అమయాక ప్రజలను వంచనకు గురి చేశాడని పోలీసులు ప్రకటించారు. కరోనా బారిన పడితే చికిత్స కోసం ఆసుపత్రులకు వెళ్లాలని, ఇటువంటి ‘బురిడీ’ బాబాలను ఆశ్రయించవద్దని పోలీసులు ప్రజలకు ఈ సందర్భంగా సూచించారు.