యాధృచ్చికమే కావచ్చు… వరుసగా ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కరోనా వైరస్ సోకింది. మొన్న జనగామలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నిన్న నిజామబాద్ రూరల్ కు చెందిన బాజిరెడ్డి గోవర్ధన్, నేడు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గణేష్ గుప్తా కరోనా బారిన పడ్డారు. ఈ పరిణామాలు సహజంగానే గులాబీ పార్టీ లీడర్లలో గుబులు రేపుతున్నాయి.
వరుసగా ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ రిజల్ట్ వస్తుండడంతో సహజంగానే వారితో సన్నిహితంగా మెలిగినవారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో ప్రైమరీ కాంటాక్ట్ కలిగి ఉండడం వల్లే అటు బాజిరెడ్డి గోవర్ధన్, ఇటు గణేష్ గుప్తాలు కూడా వైరస్ బారిన పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయా ఎమ్మెల్యేలు పాల్గొన్న పలు కార్యక్రమాలకు హాజరైన దిగువశ్రేణి పార్టీ లీడర్లు, కార్యకర్తలు, అధికారులు, సిబ్బంది కూడా తీవ్ర ఆందోళనకు గురవతున్నారు.
మరోవైపు మంత్రుల వద్ద పనిచేసే సిబ్బంది కూడా కరోనా బారిన పడుతున్న స్థితి గులాబీ కేడర్లో మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే మంత్రి హరీష్ రావు హోం క్వారంటైన్లో ఉండగా, మరో మంత్రి ఈటెల రాజేందర్ ఓఎస్డీకి కరోనా పాజిటివ్ రిజల్ట్ వచ్చిన సంగతి తెలిసిందే. మొత్తంగా తెలంగాణాలో వరుసగా ఎమ్మెల్యేలు కరోనా బాధితులుగా మారుతున్న పరిస్థితులు టీఆర్ఎస్ పార్టీలో గుబులు కలిగిస్తున్నాయి.