ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ తెలంగాణాను సైతం క్రమేణా చుట్టుముడుతున్నదా? రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సైతం అర్థంతరంగా నిరవధిక వాయిదా పడే అవకాశం ఉందా? ఇది టెర్రరైజ్ చేయడం ఏ మాత్రం కాదు. కరోనా వైరస్ నియంత్రణ అంశంలో ప్రభుత్వం సీరియస్ గా వేస్తున్న అడుగులు ఇవే సందేహాలను కలిగిస్తున్నాయి. కరోనా కట్టడికి తీసుకునే చర్యలపై ఇప్పటికే ప్రభుత్వం నియమించిన హైలెవెల్ కమిటీ సమావేశం కాబోతోంది. ఇదే దశలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని సాయంత్రం ఆరు గంటలకు ఏర్పాటు చేశారు. దేశ వ్యాప్తంగా తీసుకుంటున్న చర్యలను, వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్ధతులను బేరీజు వేసుకుని చర్చించి నిర్ణయం తీసుకోవడానికి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీలోనే ప్రకటించారు. మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు.
కరోనా వైరస్ కట్టడికి సంబంధించి రాజకీయాలు వద్దని, ప్రజలకు భరోసా కల్పించాలే తప్ప, భయం కలిగించవద్దని సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 400 మందికి సంబంధించి కరోనా అనుమానిత కేసుల్లో పరీక్షలు జరిపారు. ఇందులో సమారు పది మందిని మినహా మిగతా వారిని పరీక్షల అనంతరం వారివారి ఇళ్లకు పంపించినట్లు తెలుస్తోంది. ఈ స్వల్ప సంఖ్యలోని పది మంది వ్యక్తులకు సంబంధించిన రక్తపరీక్షల నివేదికల కోసం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వేచి చూస్తున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో తీసుకునే ముందస్తు చర్యలపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన అనేక వ్యాఖ్యలు కరోనా తీవ్రతను స్పష్టం చేస్తోందంటున్నారు. దేశంలోని ఎనిమిది రాష్ట్రాల్లో స్కూళ్లు, మరో ఆరు రాష్ట్రాల్లో స్కూళ్లతోపాటు సినిమా హాళ్లను కూడా మూసివేశారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. కరోనా వైరస్ తో తెలంగాణాకు ఎటువంటి ప్రమాదం లేదంటూనే, వైరస్ నియంత్రణకు వెయ్యి కోట్లు ఖర్చు చేస్తామని ఇప్పటికే ప్రకటించామని, కానీ అవసరమైతే ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తామని సీఎం ప్రకటించడం గమనార్హం. హైదరాబాద్ నగర జనాభాను, రాష్ట్రంలోని ఇతర నగరాల్లో గల జన సంఖ్యను కూడా సీఎం ప్రస్తావించారు. దేశ, విదేశాల నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చే 500 విమానాలు, 55 వేల మంది ప్రయాణీలకు సంఖ్యను సైతం ముఖ్యమంత్రి ఉటంకించారు. నిర్దేశిత దేశాల నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన ప్రయాణీకులను నేరుగా వికారాబాద్, దూలపల్లి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ వార్డులకు తరలిస్తామని కూడా సీఎం అసెంబ్లీలో చెప్పడం గమనార్హం. ప్రజా రక్షణ కోసం ప్రభుత్వం అనేక ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుందని, అంతమాత్రాన ప్రజలను భయ, భ్రాంతులకు గురిచేయలేం కదా? అని విపక్ష సభ్యుల వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ స్పందించడం విశేషం.
అంతేకాదు ఫంక్షన్లు, సామూహిక సమావేశాల గురించి కూడా ఆలోచిస్తున్నామని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. మరోవైపు ప్రభుత్వం ఆదేశిస్తే సినిమా థియేటర్లను మూసివేస్తామని కూడా చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాతల మండలి సమావేశంలో చర్చించినట్లు వార్తలు వచ్చాయి. స్వయంగా ముఖ్యమంత్రి నోటి నుంచే ఫంక్షన్లు, సామూహిక సమావేశాల గురించి వ్యాఖ్యలు వచ్చిన పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాలను సైతం షెడ్యూల్ గడువుకు వారం ముందే అర్థంతరంగా నిరవధిక వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా పరిశీలించినపుడు కరోనా అంశంలో తెలంగాణా ప్రభుత్వం శరవేగంగా తీసుకుంటున్న చర్యలు పరిస్థితి తీవ్రతను వెల్లడిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.