గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాపించే అంశంలో ఫ్లోరిడా యూనివర్సిటీ కీలక ప్రకటన చేసింది. గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుందని చెప్పేందుకు ఆధారాలు ఉన్నట్లు ఆయా యూనివర్సిటీకి చెందిన వైరాలజీ నిపుణులు స్పష్టం చేశారు. ఈ మేరకు మెడ్ రెక్సివ్ లో పరిశోధనా పత్రాన్ని కూడా ప్రచురించారు.
గాలి వల్ల కరోనా 4.8 మీటర్ల వరకు వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు. అందువల్ల ప్రస్తుతం పాటిస్తున్న భౌతిక దూరం సరిపోదని, కరోనా మార్గదర్శకాల్లో మార్పులు చేయాల్సిన అవసరముందని కూడా నిపుణులు సూచించారు. వైరస్ వ్యాప్తిని, క్లస్టర్లను అడ్డుకోవాలంటే మార్గదర్శకాల మార్పు అనివార్యమంటున్నారు.
దగ్గుతూ, ముక్కు చీదుతూ మాట్లాడేవారి సమీపంలోని గాలిని పీల్చడం ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందన్నారు. చిన్న చిన్న తుంపర్లలో కరోనా వైరస్ అణువులు గాల్లో అలాగే ఉంటున్నాయన్నారు. గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుందని చెప్పేందుకు ఆధారాల్లేవని వాదించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇందుకు తమ వద్ధ ఆధారాలు ఉన్నాయని పలు దేశాలకు చెందిన 239 మంది సైంటిస్టులు లేఖ రాయడంతో అంగీరించడం గమనార్హం.