దిన పత్రికల వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందదు. గత కొన్ని రోజులుగా తెలుగు ప్రింట్ మీడియాకు చెందిన ప్రముఖ పత్రికలన్నీ ఊదర గొడుతున్న వార్తల సారాంశమిదే. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ప్రారంభించి… దేశ, విదేశాలకు చెందిన పలువురు వైద్యుల చేత కూడా ఇదే తరహా అభిప్రాయాలతో వార్తా కథనాలను ప్రముఖంగా ప్రచురిస్తున్నాయి. చివరికి సెక్స్ సమస్యలను నివృత్తి చేసే డాక్టర్ సమరం కూడా పత్రికల ద్వారా కరోనా వైరస్ సోకడమనేది జోక్ గా అభివర్ణించడం గమనార్హం. ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా అసోసియేషన్ (ఇన్మా) సీఈవో ఎర్ల్ విల్కిన్సన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు ప్రింట్ మీడియా సంస్థలు గాయి గాయి చేస్తున్నాయి.

ఓకే.. పత్రికల వల్ల కరోనా వైరస్ సోకదనే అంశాన్ని కాసేపు విశ్వసిద్దాం. డాక్టర్ సమరం నుంచి అంతర్జాతీయ వార్తా సంస్థల ముఖ్యుడు విల్కిన్సన్ చెప్పారు కాబట్టి పూర్తిగా నమ్ముదాం. కానీ ఇంత మంది ప్రముఖులు చెప్పినా పాఠకులు మాత్రం నమ్మడం లేదని ప్రింట్ మీడియా సంస్థలకు ఏదేని అనుమానం కలిగిందా? తాము ఎంత ప్రముఖంగా పేరాలకొద్దీ వార్తలు రాసినా పాఠకులు విశ్వసించడం లేదనే అంచనాకు వచ్చాయా? ఎందుకంటే… పత్రికల వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందదంటూనే తమ సంస్థ ప్రచురిస్తున్న పత్రికలను శుద్ధి (శానిటైజేషన్) చేస్తున్నట్లు ప్రముఖ దినపత్రికల యాజమాన్యాలు టాంటాం చేసుకుంటున్నాయి. పత్రికల వల్ల వైరస్ వ్యాప్తి చెందదని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ప్రముఖ వైద్యులు కూడా స్పష్టం చేస్తున్నప్పటికీ, ప్రింటింగ్ సమయంలోనే శానిటైజర్ ను స్ప్రే చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది విరుద్ధ విధానం కాదా? ఇవీ పాఠకుల సందేహాలు.

కరోనా వైరస్ తీవ్రత, పాఠకుల్లో భయం నెలకొన్న పరిణామాల్లో, వారిలో ధైర్యం నింపేందుకు, కరోనా కట్టడిలో భాగంగా ముందు జాగ్రత్త చర్యగానే కాసేపు భావించినప్పటికీ, ఇంకా అనేక సందేహాలకు ప్రింట్ మీడియా సంస్థల నుంచి జవాబులు లభించాల్సి ఉంది. అవేమిటంటే…

1) ప్రింటింగ్ అనంతరం ఎడిషన్ సెంటర్లోనే పత్రికలను ఏజెన్సీల వారీగా ప్యాక్ చేస్తారు. పత్రికలను శానిటైజర్ తో స్ప్రే చేస్తున్న తర్వాత, ప్యాకింగ్ బాయ్ ల ప్రాణ రక్షణకు యాజమాన్యాలు కనీస చర్యలు తీసుకుంటున్నాయా? వారికి చేతులకు కనీసం గ్లౌజులను అందిస్తున్నాయా?

2) ప్యాక్ చేసిన పత్రికల కట్టలను రవాణా వాహనాల్లోకి తరలించే సందర్భంగా సంబంధిత కార్మికులకు శానిటైజర్లుగాని, చేతులకు గ్గౌజులుగాని ఇస్తున్నాారా?

3) పేపర్ బండిల్స్ ను జీపుల్లో, ఆటోల్లో, కార్లలో, ఇతర్రతా వాహనాల్లో రవాణా చేస్తుంటారు. ఈ సందర్భంగా ఆయా వాహనాల డ్రైవర్లకుగాని, సహాయకులకుగాని శానిటైజర్లను, గ్లౌజులను సమకూరుస్తున్నారా?

4) వివిధ నగరాల్లో, పట్టణాల్లో పేపర్ బండిళ్లను స్వీకరించే ఏజెంట్లకు, హాకర్లకు శానిటైజర్ సౌకర్యాలు ఉన్నాయా? పత్రికా యాజమాన్యాలు వీటిని సరఫరా చేస్తున్నాయా?

5) ఇక పత్రిక పాఠకుని చెంతకు చేరే చివరి ప్రక్రియలో కీలకమైన పేపర్ బాయ్ లకు మాస్కులుగాని, శానిటైజర్లుగాని ఇచ్చే బాధ్యత ఎవరిది?

6) కేవలం ప్రింటింగ్ సమయంలో శానిటైజర్ ద్వారా నాణ్యత పాటిస్తున్నట్లు ప్రకటిస్తున్న పత్రికల యాజమాన్యాలు, అనంతర ప్రక్రియలో అనేక మంది చేతులు మారుతున్న పత్రికల నుంచి పాఠకులకు ఇస్తున్న పూర్తి స్థాయి భరోసా ఏమిటి?

సాక్షి పత్రికకు ప్రింటింగ్ సమయంలో శానిటైజర్ స్పే చేస్తున్న దృశ్యం

ఇటువంటి అనేక సందేహాలకు సమాధానం లభించకపోవచ్చు. కానీ పత్రికల ద్వారా మాత్రమే విశ్వసనీయ సమాచారం లభిస్తుందని వార్తా కథనాల ద్వారా ఊదరగొడుతున్న ప్రముఖ ప్రింట్ మీడియా యాజమాన్యాలు, ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో తమ సంస్థలకే చెందిన వెబ్ సైట్లను, ఇతర డిజిటల్ వ్యవస్థలను కూడా ఆశ్రయించవచ్చంటూ వార్తలు ప్రచురించకపోవడమే కొసమెరుపు.

మొత్తంగా ఈ వార్తా కథనం పత్రికల పట్ల పాఠకుల్లో భయాందోళన కలిగించడం కాదు… వైరస్ వ్యాప్తి చెందదని ఓవైపు వార్తా కథనాలు వడ్డిస్తూనే, పత్రికలకు శానిటైజర్ స్ప్రే చేస్తున్న వైరుధ్య విధానాన్ని ప్రశ్నించడం మాత్రమే. అంతిమంగా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రింట్ పత్రికను తీసుకోవడం, తీసుకోకపోవడం పాఠకుని ఇష్టం.

Comments are closed.

Exit mobile version