పై ఫొటో చూశారుగా?
కరోనా వైరస్ సోకిన పేషెంట్ చనిపోతే ఫొటోలో చూపించినట్లుగా బ్యాగులో చుట్టి ప్లాస్టిక్ బాక్స్ లో సీల్ వేస్తారు. కనీసం డెడ్ బాడీని ఇంటికి కూడా పంపించరు. అయినవాళ్ల కడసారి చూపునకూ నోచుకోరు. కాల్చేసిన తర్వాత చితాభస్మంగా పిలిచే బూడిద కూడా ఇస్తారో, ఇవ్వరో తెలియని పరిస్థితి. మనిషి జీవితంలో ఇంతకన్నా భయంకరమైన వీడ్కోలు ఉండకపోవచ్చు కూడా.
ఇప్పుడు ఈ ఫొటో చూడండి. ఈ యువకుడు ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ అడవుల్లో నివసిస్తుంటాడు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకునే చర్యలకు మద్ధతుగా ఆదివాసీ గిరిజనుడైన ఇతను తన వంతు ప్రయత్నం చేశాడు. మాస్కులు లభించని పరిస్థితులకు అతనేమీ వెరవలేదు. తన సహజ జీవన శైలికి అనుగుణంగా ఓ అటవీ ఉత్పత్తితోనే మాస్క్ తయారు చేసుకున్నాడు. బహుషా తునికాకు (బీడీ ఆకు) కావచ్చు. ఈ వేసవి సీజన్లో అడవుల్లో పచ్చగా ఉండే అతికొద్ది చెట్లల్లో తునికి జాతి చెట్టు కూడా ఉంటుంది. అదే ఆకుతో మాస్కును తయారు చేసుకుని ‘యే హై హమారా బస్తర్ కా టాలెంట్’ అంటున్న ఇతని కరోనా కట్టడి స్ఫూర్తిని ప్రశంసించాల్సిందే.
ఈ ఫొటో గురించి కూడా తెలుసుకుందాం. ఇతని పేరు గుగ్గిళ్ల శ్రీకాంత్ గౌడ్. తెలంగాణాలోని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ నేత. కరోనా కట్టడికి ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్ ను ఉల్లంఘించి రోడ్డు మీద స్వైర విహారానికి వచ్చాడు. ప్రశ్నించిన పోలీసులపై తిరుగుబాటు చేశాడు. ‘నేను లీడర్ ను తెలుసా? గౌరవించడం తెలుసుకోండి’ అని పేట్రేగిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఘటనపై ఆగ్రహించిన సిరిసిల్ల కలెక్టర్ ఆదేశంతో అరెస్టయి ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడు.
అందుకే సోషల్ మీడియాలో నాలుగు వాక్యాలతో కూడిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. అదేమిటంటే… ఉన్నవి నాలుగే అవకాశాలు:
1) లాక్ డౌన్ ను పాటిస్తూ ఇంటికే పరిమితం కావడం.
2) సర్కార్ ఆదేశాన్ని ఉల్లంఘించి పోలీస్ స్టేషన్లో ఉండడం.
3) విచ్చలవిడిగా రోడ్లపై తిరిగి కరోనా రోగిగా ఆసుపత్రిలో చేరడం.
4) కరోనా రోగం ధాటికి తాళలేక ఫొటోకు దండ వేయించుకోవడం.