దిగువన గల ఫొటో చూశారు కదా? ఈ వ్యక్తి ఎవరోగాని అత్యంత జాగ్రత్తపరునిలా కనిపిస్తున్నాడు కదూ! అదేమిటీ మనిషి కనిపించడం లేదు, మద్యం సీసాలు మాత్రమే కనిపిస్తున్నాయని ఆశ్చర్యపోకండి. కరోనా భయపెడుతోందిగా… అందుకే ఈ వేషధారణ అన్నమాట.
అలవాటో, వ్యవసనమో గాని ఆ మనిషిని మద్యం పిలిచింది. కానీ ప్రాణంపై ఎక్కడా లేని భీతి కలిగినట్లుంది. అందుకే ఇలా పీపీఈ కిట్ ధరించి మరీ మద్యం షాపునకు వచ్చినట్లున్నాడు. ఓ రెండు బీర్ సీసాలను ఎంచక్క తీసుకువెడుతుండగా ఇలా కెమెరాకు చిక్కాడన్నమాట.
మన ఫొటో జర్నలిస్టులు పోనీలే పాపం అని ఇటువంటి అరుదైన దృశ్యాన్ని వదిలేయరుగా… అందుకే కాబోలు హైదరాబాద్ లో ఉండే ఫొటో జర్నలిస్టు మిత్రుడు ఒకరు ఈ ఫొటోను ts29కు పంపిస్తూ ‘దండం సామీ… మీలాంటి వాళ్ళు అందరికీ ఆదర్శం కావాలి… ఈ దృశ్యం చూసిన కరోనా ఆత్మహత్య చేసుకోవాలి’ అని కామెంట్ కూడా జోడించారు.
నిజమే కదా! ఇన్ని జాగ్రత్తలు తీసుకుని , నేరుగా కడుపులోకే అల్కహాలిక్ శానిటైజర్ ను బీర్ రూపంలో పంపించాక కరోనా ఆత్మహత్య చేసుకోక మరేం చేస్తుంది!!