సోషల్ డిస్టెన్సింగ్ అంటే కేరళలోని మందుబాబులకు, మద్యం షాపు నిర్వాహకులకు ఇలా అర్థమైనట్లుంది. సోషల్ డిస్టెన్సింగ్ అంటే ఏమిటి? ఒకరికి మరొకరు కనీస దూరం పాటించాలనే కదా అసలైన అర్థం? కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సామాన్య ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారో లేదోగాని, కేరళలోని మద్యపాన ప్రియులు మాత్రం ‘సుక్క’శుద్ధితో పాటిస్తున్నారు. కరోనా రానీ, దాని తాత రానీ, కానీ తమ గొంతులో మాత్రం ‘సుక్క’ పడాల్సిందేనని పట్టుబడుతున్నారట. అందుకే ఇలా మద్యం షాపుల ముందు బారులు తీరుతున్నారట.

కానీ ఎంతలేదన్నా కరోనా వ్యాధి భయపెడుతోంది కదా? అందుకే గత్యంతరం లేని పరిస్థితుల్లో మద్యం షాపుల ముందు వాటి నిర్వాహకులు మందుబాబుల క్యూ కోసం ‘డిస్టెన్స్’ గీతలు గీశారు. ఈ గీతల్లో నిర్దేశించిన ప్రకారం మాత్రమే మందుబాబులు క్యూలో ముందుకు కదలాలి. కనీస దూరాన్ని పాటిస్తూ కదలాలి. కరోనా నిరోధానికి జనం బయటకు రావద్దని పాలకులు, అధికారులు గగ్గోలు పెడుతున్నా ఇక్కడి మందుబాబులు బేఖాతర్ చేస్తున్నట్లే కనిపిస్తోంది. గీసిన గీతలు దాటకుండా ఎంతో క్రమశిక్షణగా మందుబాబులు లిక్కర్ షాపుల ముందు నిల్చుని మరీ తమకు అవసరమైన బ్రాండ్ ను తీసుకుని ‘మత్తు’గా కదలుతున్నారుట.

ఓవైపు కరోనాకు భయపడుతున్నట్లుగా ముఖాలకు కర్చీఫ్ అడ్డుపెట్టుకుని కొందరు, చేతులతో ముఖాన్ని దాచుకుంటూ మరికొందరు ‘మద్య’ గీతల్లో పయనిస్తున్నారు. ఓ వ్యక్తి ఏకంగా హెల్మెట్ పెట్టుకుని మరీ క్యూలో నిల్చోవడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కేరళలో లిక్కర్ షాపు ముందు క్యూ కట్టిన మందుబాబుల వీడియోను దిగువన మీరూ చూడవచ్చు.

Comments are closed.

Exit mobile version