కరోనా కేసులు విస్తరించకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రంగా ఉంది. ఈ విషయంపై సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం. ఇరుగు, పొరుగున గల కరీంనగర్, ఖమ్మం జిల్లాల కంటే ముందే మొదటి కరోనా కేసు నమోదై రాష్ట్ర వ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కిన భద్రాద్రి జిల్లా, ప్రస్తుతం ఇతర జిల్లాల్లో కేసుల నమోదు పెరుగుతున్నప్పటికీ ఇక్కడ గత 14 రోజుల్లో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.
ఇటలీ నుంచి అశ్వాపురం వచ్చిన విద్యార్థినికి మొదట పాజిటివ్ కేసుగా నమోదు అయింది. ఆ తర్వాత కొత్తగూడెంలో పోలీసు అధికారి కుమారుడు లండన్ నుంచి వచ్చి ఎవరికీ చెప్పకుండా తిరిగాడు. చివరికి అతనికి పాజిటివ్ వచ్చింది. అతను సన్నిహితంగా ఉన్న వారందరినీ క్వారంటైన్ లో ఉంచి పరీక్షలు చేశారు. లండన్ నుంచి వచ్చిన కుమారుడు నుండి పోలీసు అధికారి అయిన తండ్రికి, వారి ఇంటి పని మనిషికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విధంగా జిల్లాలో మొత్తం నాలుగు కేసులు నమోదు అయ్యాయి. ఇక్కడ నాలుగు కేసులు నమోదు అయినప్పుడు పక్కనే గల ఖమ్మం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. నేడు ఖమ్మం జిల్లాలో ఏడు పాజిటివ్ కేసులతో పాటు ఇతర జిల్లాల లోనూ రోజు రోజుకు కొత్త కేసులు పెరుగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నమోదైన నాలుగు కేసుల్లో రెండు నెగిటివ్ వచ్చి ఇంటికి వచ్చారు. మిగిలిన ఇద్దరు కూడా రికవరీ లో ఉన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ మర్కజ్ కు హాజరై వచ్చిన వారు 10 మంది, విదేశాల నుంచి వచ్చిన వారు 243 మంది, వీరికి సన్ని హితంగా మెలిగిన వారు 1,200 మందిని, ఈ విధంగా అందరినీ పరిశీలనలో ఉంచి పరీక్షలు చేస్తూ వచ్చారు. వీరిలో ఎవరికీ పాజిటివ్ రాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ జిల్లాలోనూ కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం, ఇల్లెందు లాంటి పెద్ద పట్టణాలు, మారు మూల ఏజెన్సీ గ్రామాలు ఉన్నాయి. అంతటా సమన్వయం పాటించి కరోనాను దూరంగా పెట్టారు.
లాక్ డౌన్ ను అధికారులు పగడ్బందీగా అమలు చేయడం తో పాటు ప్రజల సహకారం కూడా ఉందని చెప్పవచ్చు. ఈ జిల్లా ప్రజలు బయటకు వెళ్ళకుండా, బయటి వారు జిల్లాలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మొదట నాలుగు కేసులు నమోదైన వారితో భౌతిక దూరం పాటించడం వలనే కేసుల నమోదు కాలేదని అర్థమవుతుంది.
మొత్తంగా ప్రపంచం మొత్తం కరోనా తో అతలాకుతలం అవుతుండగా, నేడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రంగా ఉండటం పట్ల ప్రతి ఒక్కరూ సంతోషించే విషయంగా చెప్పవచ్చు.
✍ తుమ్మలపల్లి ప్రసాద్