ఒకవైపు అంతరిక్షాన్ని శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో జయించే పరిస్థితి. మరోవైపు మూఢ నమ్మకాలతో ప్రపంచ దేశాల ముందు సిగ్గుతో తలదించుకోవాల్సిన దుస్థితి !!
తన భర్తకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో తనను ఇంట్లోనుంచి గెంటి వేశారని ఆవేదన చెందుతూ గత్యంతరం లేని పరిస్థితులలో ఆ ఏ ఎన్ ఎం వర్షంలో తడుస్తూ తనను ఇంటిలోనికి రానీయడం లేదని రోదిస్తున్నఈ వీడియో మన సమాజంలోని వికృత పోకడలకు ఒక నిదర్శనంగా నిలుస్తుంది.
స్వంతవారే తమ వారిని ఇలా సాంఘిక బహిష్కారానికి తలపడటం కరోనా పుణ్యమే ! గతంలో కులపెద్దలు చెప్పినట్లు వినలేదని కులంలోంచి వెలివెయ్యటం జరిగేది. వెలి వేయబడ్డవాళ్ళతో ఏ ఒక్కరూ మాట్లడకపోవటం, వారికి సహాయనిరాకరణ చేయడం జరిగేవి .
గతంలో కొన్ని గ్రామాలలో కుటుంబాలను వెలివేయడం సర్వసాధారణంగా ఉండేది .కులపెద్దల ఆగడాలను ప్రశ్నిస్తే ఎవరికైనా అదే గతి. గ్రామంలో నలుగురు కుల పెద్దలు చెప్పిందే వేదం. నల్గురు కులపెద్దలు, సారాయి, కోడిపందేలు, పేకాటలు కూడా గ్రామంలో కలహాలకు, కలుషిత వాతావరణానికి దోహదం చేస్తున్నాయి. కుల పెద్దలు ఏదైనా విషయంపై తమతో ఏకీభవించనివారిని, తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పని వారిని, వెలివేయబడిన వారి శుభకార్యానికి వెళ్ళినవారిని, పోటిదారులకు వచ్చేలాభాన్ని తామే కాజేయాలనే దురాలోచనతో కులపెద్దలు వెలివేస్తారు.
వెలి ఒక అనైతిక చర్య .హుకుం జారీ చేసే కులపెద్దల అహంకారానికి నిదర్శనం.వెలివేసిన కుటుంబాలను ఆహ్వానిస్తే తాము రామంటూ కులపెద్దలు వాదనకు దిగుతారు. తమ మాటలు పెడచెవిన పెట్టారంటూ కక్ష కట్టిన కుల పెద్దలు గ్రామస్థులు ఎవరూ హాజరు కాకుండా మూర్కంగా అడ్డుకొంటారు. సభ్య సమాజం తలదించుకునేలా కులపెద్దలు ఇష్టానుసారంగా వ్యవహరించే విపరీత ధోరణి వెలి. జరిమానాగా వెలివేయబడినవారు తప్పు కట్టి తిరిగి కులంలో చేరుతారు. కట్టించుకున్న తప్పు మొత్తంతో తాగి తందనాలాడి కులపెద్దలు జల్సా చేసేవారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించడం.. కాంటాక్ట్ కుటుంబాన్ని హోం క్వారంటైన్లో తరలించాల్సిన బాధ్యత అధికారులకు ఉంది.
✍️ ఎన్. జాన్సన్ జాకబ్, మచిలీపట్నం.