రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ అభిమానులతోపాటు టీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఒకింత హైరానా పడుతున్నాయి. ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కరోనా బారిన పడిన తాజా పరిణామాలే ఇందుకు ప్రధాన కారణం. ఎందుకంటే నిన్న గాక మొన్ననే మంత్రి అజయ్ కుమార్ పినపాక నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. అశ్వాపురం, కరకగూడెం, మణుగూరు మండలాల్లో పర్యటించి కోట్లాది రూపాయల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రి వెంట మహూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత తదితర ప్రముఖ నేతలు కూడా ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అయితే ఈ పర్యటన ముగిసిన 24 గంటల వ్యవధిలోనే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కరోనా వైరస్ బారిన పడ్డట్లు వైద్యపరీక్షల్లో గురువారం నిర్ధారణ అయింది. దీంతో కాంతారావు హోం ఐసొలేషన్ కు వెళ్లారు. పినపాక నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా మంత్రి అజయ్, విప్ కాంతారావు ఒకే కారులో ప్రయాణించినట్లు కూడా స్థానిక నేతలు చెబుతున్నారు. అంతేగాక మరో కార్యక్రమంలో కాంతారావు మాట్లాడుతున్న మైక్ మౌత్ పీస్ పనిచేయకపోవడంతో, తన చేతిలో గల మౌత్ పీస్ ను మంత్రి అజయ్ ఆయనకు ఇచ్చారని, ఆ తర్వాత అదే మైకు ద్వారా మంత్రి కూడా మాట్లాడారని స్థానిక కార్యకర్తలు తాజాగా గుర్తు చేస్తున్నారు. పర్యటనలో తన ఇంటికి వచ్చిన మంత్రి అజయ్ కుమార్ ను విప్ కాంతారావు శాలువా కప్పి సత్కరించారు. ఆయా పలు దృశ్యాల్లో కాంతారావుతోపాటు మంత్రి అజయ్ మాస్కులు లేకుండానే కనిపించడం గమనార్హం.
పినపాక నియోజకవర్గంలో పర్యటించిన మరుసటిరోజు మంత్రి అజయ్ ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణణ్ తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రఘునాథపాలెం ఎమ్మార్వో ఆఫీసులో ధరణి పోర్టల్ ను మంత్రి కలెక్టర్ తో కలిసి ప్రారంభించారు. ఇదేరోజు కాంతారావుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో మంత్రి అజయ్ అభిమానులతోపాటు, పార్టీ కార్యకర్తలు కాస్త హైరానా పడుతున్నట్లు తెలుస్తోంది. కానీ మంత్రి అజయ్ మాత్రం కాంతారావుకు కరోనా సోకిన పరిణామాలపై ఏమాత్రం కంగారు పడకపోవడం కూడా పార్టీ కేడర్ ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
నిన్న ఖమ్మం జిల్లాలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి అజయ్ శుక్రవారం హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ తో కలిసి మరో కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిక్ వెహికిల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్ పాలసీ 2020- 2030 ఆవిష్కరణ కార్యక్రమానికి అజయ్ కూడా హాజరయ్యారు. విప్ కాంతారావుకు కరోనా సోకడం, నిన్నగాక మొన్నటి రోజునే ఆయనతో కలిసి పలు కార్యక్రమాల్లో తానూ పాల్గొన్నప్పటికీ, తాజా పరిణామాలపట్ల అజయ్ ఏమాత్రం ఆందోళనకు గురికాకపోవడం విశేషంగా పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఇటువంటి ఘటనల సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన కోవిడ్-19 మార్గదర్శకాల సంగతి ఎలా ఉన్నప్పటికీ, కాంతారావుకు కరోనా సోకిన నేపథ్యంలో వివిధ కార్యక్రమాల్లో నిర్విరామంగా పాల్గొంటున్న మంత్రి అజయ్ ధైర్యానికి ఆ పార్టీ కేడర్ ఒకింత నివ్వెరపోతోంది.
బుధవారం పినపాక నియోజకవర్గంలో విప్ కాంతారావుతో, గురువారం ఖమ్మం జిల్లాలో కలెక్టర్ ఆర్వీ కర్ణణ్ తో, శుక్రవారం మంత్రి కేటీఆర్ తో కలిసి అజయ్ కుమార్ పాల్గొన్న వేర్వేరు కార్యక్రమాల దృశ్యాలను దిగువన స్లైడ్ షోలో తిలకించవచ్చు.