కరోనా నియంత్రణలో రానున్న మూడు, నాలుగు వారాలు అత్యంత కీలకమని తెలంగాణా పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పెళ్లిళ్లు, పండగల సీజన్ కారణంగా ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. కరోనా లక్షణాలు ఉన్నవారికే టెస్టులు చేస్తున్నట్లు చెబుతూ, జ్వరం, విరేచనాలు, వాసన, రుచి కోల్పోవడం వంటి లక్షణాలు ఉన్నవారే టెస్టుకు రావాలని సూచించారు. అదేవిధంగా కరోనా పరీక్షా కేంద్రాల్లో గుంపులుగా ఉండటం సరికాదన్నారు. సాధారణ లక్షణాలు రెండు మూడు రోజులకుగానీ తగ్గకపోతే మాత్రమే టెస్టులు చేయించుకోవాలన్నారు. గడచిన వారం రోజులుగా తెలంగాణలో పరిస్థితులు కొంతమేర కుదుట పడుతున్నాయన్నారు. కేసుల పెరుగుదలలో స్థిరత్వం కనిపిస్తోందన్నారు.