పొరుగున గల ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు నక్సల్స్ కరోనా భీతిని ఎదుర్కుంటున్నారా? ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోనూ కరోనా వ్యాప్తి ఉన్నప్పటికీ, అడవుల్లో గల నక్సల్స్ సైతం తాజాగా ఈ వైరస్ పట్ల తీవ్రంగా ఆందోళన చెందుతున్నారా? అవుననే అంటున్నాయి ఆ రాష్ట్ర పోలీసు వర్గాలు. ఇందుకు తాజాగా చోటు చేసుకున్న ఓ ఘటనను ఉదహరిస్తున్నాయి.
వాస్తవానికి కరోనా అంశంలో ప్రారంభ దశలోనే అంటే గత మార్చిలోనే మావోయిస్టులు తమ రహస్య ప్రాంతాలను పూర్తిగా ‘లాక్’ చేసినట్లు వార్తలు వచ్చాయి. అంతేగాక సంస్థ ద్వారా అటవీ గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహించినట్లు ఆయా వార్తల సారాంశం.
ప్రపంచ మహమ్మారి కరోనా బారి నుంచి తప్పించుకునేందుకు ‘అబూజ్ మడ్’ అటవీ ప్రాంతాన్ని మావోయిస్టులు ‘లాక్’ చేసి, కరోనా కట్టడికి తీసుకున్న చర్యలు పెద్దగా ఫలించలేదని సమాచారం. బస్తర్ లోని నారాయణపూర్ ప్రాంతంలో గల అబూజ్ మడ్ గత కొంత కాలంగా నిశ్శబ్ధ వాతావరణంలో ఉంది.
కరోనా బారి నుంచి తప్పించునేందుకు మాస్కులు, శానిటైజర్ల కోసం కూడా మావోయిస్టు నక్సల్స్ ప్రయత్నించారు. అత్యవసరంగా మాస్కులు, శానిటైజర్లను సమకూర్చాలని నారాయణపూర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన తమ సానుభూతిపరులకు నక్సల్స్ లక్ష రూపాయల నగదును కూడా అందించినట్లు వార్తలు వచ్చాయి, అయితే ‘లాక్ డౌన్’ పరిణామాల కారణంగా ఆయా సామాగ్రి నక్సల్స్ కు చేరలేదని ఛత్తీస్ గఢ్ ఇంటలిజెన్స్ వర్గాలు నివేదించాయి.
ఈ పరిస్థితుల్లోనే కరోనా బారిన పడకుండా మాస్కులు ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని అటవీ గ్రామాల ప్రజలకు నక్సల్స్ చెబుతున్నారు. తమ ఆధిపత్య ప్రాంతాల్లోకి బయటి వ్యక్తుల రాకపోకలను నక్సల్స్ నిషేధించారు కూడా. కానీ తాజా పరిణామాల్లో ఓ ఘటన నక్సల్స్ ను భీతావహానికి గురి చేసినట్లు ఛత్తీస్ గఢ్ పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
బీజాపూర్ జిల్లా మోదక్ పాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెడక్వాలి గ్రామానికి చెందిన సుమిత్రా చెపా (32) అనే మహిళా నక్సల్ ను మావోయిస్టులు పార్టీ నుంచి బయటకు పంపారని ఛత్తీస్ గఢ్ రాష్ట్ర పోలీసుల వర్గాలు పేర్కొంటున్నాయి. దగ్గు, జలుబుతో తీవ్రంగా బాధపడుతున్న సుమిత్రా చెపా తన స్వంత గ్రామానికి రాగా పోలీసులు అమెను అరెస్ట్ చేశారు. అనంతరం వైద్య పరీక్షల నిర్వహించి ‘క్వారంటైన్’కు పంపారు. దశాబ్ధ కాలం నుంచి మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న సుమిత్రాను కరోనాకు భయపడి నక్సలైట్లు పార్టీ నుంచి బయటకు పంపించారనేది పోలీసు వర్గాల వాదన.
ఉద్యమపరంగా అటవీ ప్రాంతాల్లో రహస్య జీవితం గడిపే నక్సల్స్ అనారోగ్యం బారిన పడడం సహజమే. తప్పనిసరి పరిస్థితుల్లో వైద్య పరీక్షల కోసం అడవుల నుంచి బయటకు వచ్చిన సందర్భాల్లో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్న ఉదంతాలు కూడా అనేకం. కానీ సుమిత్రా చెపా అంశంలో ఛత్తీస్ గఢ్ పోలీసు వాదన భిన్నంగా ఉండడం గమనార్హం. ‘కరోనా‘ భయం వల్లే నక్సల్స్ ఆమెను పార్టీ నుంచి బయటకు పంపారనే వాదన చర్చకు దారి తీసింది.