రాష్ట్ర వ్యాప్తంగా పలువురు జర్నలిస్టులను పొట్టనబెట్టుకుంటున్న కరోనా మహమ్మారి ఖమ్మం జర్నలిస్టులను కూడా చుట్టుముట్టింది. ఇప్పటికే కరోనా బారిన పడిన అనేక మంది ఖమ్మం జర్నలిస్టులు కోలుకోగా, మరికొందరు ఇంకా చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా మరికొందరు జర్నలిస్టులు కరోనా బారిన పడ్డారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన ఓ ప్రమఖ న్యూస్ ఛానల్ ప్రతినిధి కరోనా బారిన పడి కోలుకుంటున్నారు. అదేవిధంగా వైఎస్ షర్మిల సభలో విధులు నిర్వహించిన ఇంకొందరు జర్నలిస్టులు కరోనాతో పోరాడి చికిత్స ద్వారా కోలుకున్నట్లు తెలుస్తున్నది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఆంధప్రభ ప్రతినిధి ఎం. పాపారావు కరోనా బారిన పడ్డారు. గడచిన నాలుగైదు రోజులుగా కరోనాతో ఇబ్బంది పడుతున్న పాపారావు ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే పరిస్థితిలో మార్పు రాకపోవడం, పైగా మరింత ఇబ్బంది పడుతున్న పాపారావును ఆంధ్రజ్యోతి విలేకరి సత్తుపాటి రాము ఆదివారం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ఐసీయూలో పాపారావును చేర్చుకున్న ప్రభుత్వాసుపత్రి సిబ్బంది ఆక్సిజన్ అందిస్తూ అవసరమైన ఇంజక్షన్ల ద్వారా అతనికి చికిత్స చేస్తున్నట్లు రాము పేర్కొన్నారు. వివిధ పత్రికలకు, ఛానళ్లకు చెందిన ఇంకొందరు విలేకర్లు కూడా కరోనా బారిన పడినట్లు తెలుస్తున్నప్పటికీ, అధికారికంగా వెల్లడి కాలేదు. ఇందులో కొందరు హైదరాబాద్ ఆసుపత్రుల్లో చేరినట్లు సమాచారం.
కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జర్నలిస్టులు మరింత జాగ్రత్తగా ఉండాలని, దాని బారిన పడి చికిత్స తీసుకుంటున్న జర్నలిస్టులు త్వరగా కోలుకోవాలని ts29 కోరుకుంటోంది.
ఫొటో: పాపారావు