తెలంగాణా… ఉమ్మడి ఖమ్మం జిల్లా… నేలకొండపల్లి నుంచి కూసుమంచి మీదుగా తిరుమలాయపాలెం మండలాల చుట్టూ సూర్యాపేట జిల్లా సరిహద్దులు. ఖమ్మం జిల్లాలోని ఆయా ప్రాంతాలకు సూర్యాపేట జిల్లా కేంద్రంతో విడదీయరాని బంధం. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు నిత్య రాకపోకలు. కానీ ప్రస్తుతం డేంజర్ జోన్లో గల సూర్యాపేటలో కరోనా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజే 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో 26 కేసులు సూర్యాపేటలోనే వెలుగు చూశాయి. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారిల పర్యటన. ప్రత్యేకాధికారిగా ఐఏఎస్ నియామకం.సూర్యాపేట డీఎంహెచ్వో బదిలీ. సూర్యాపేటలో నెలకొన్న కరోనా వ్యాప్తి పరిణామాలపై ప్రభుత్వం తీసుకుంటున్న తాజా చర్యలివి.

బోనకల్, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, అశ్వారావుపేట… ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆయా మండలాలను ఆనుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్టా జిల్లా వత్సవాయి, పెనుగంచిప్రోలు, తిరువూరు, నూజివీడు, పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, చింతలపూడి తదితర ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో వత్సవాయి, ఆ పక్కనే గల జగ్గయ్యపేట మండలాలను అక్కడి ప్రభుత్వం రెడ్ జోన్ ప్రాంతాలుగా గుర్తించింది. అశ్వారావుపేటకు అత్యంత సమీపంలోని జంగారెడ్డిగూడేన్ని కూడా రెడ్ జోన్ గా ప్రకటించారు. చింతలపూడి, నూజివీడు ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

సూర్యాపేటలో సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటన దృశ్యం

అటు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు మండలాల్లో, ఇటు తెలంగాణాలోని సూర్యాపేట జిల్లాలో నెలకొన్న కరోనా ‘డేంజర్’పరిణామాలు పక్కనే గల ఖమ్మం జిల్లా వాసులను తీవ్రంగా కలవరపరుస్తున్నాయి. తాజా పరిణామాల్లో సూర్యాపేట నుంచి ఖమ్మం జిల్లాకు ప్రవేశించే పలు మార్గాలను కట్టడి చేసినప్పటికీ, ఆ జిల్లాతో విడదీయలేని అనుబంధం గల పల్లెల్లోని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ రావడం, ఆమె ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని ఓ గ్రామంలోకి వచ్చినట్లు వార్తలు. దీంతో ఆయా గ్రామానికి చెందిన దాదాపు 30 మందిని క్వారంటైన్ కు తరలించినట్లు జరిగిన ప్రచారం ధృవపడాల్సి ఉంది.

ఇక ఆంధ్రప్రదేశ్ సరిహద్దులను ఆనుకుని ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా మండలాల ప్రజలు సైతం అక్కడి తాజా పరిణామాల నేపథ్యంలో ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా తిరువూరుకు అత్యంత సమీపంలో గల కల్లూరు, పెనుబల్లి, నూజివీడు, చింతలపూడి మండలాలతో నిత్య సంబంధాలు గల సత్తుపల్లి, దమ్మపేట, జంగారెడ్డిగూడెం పక్కనే గల అశ్వారావుపేట ప్రాంతాల వాసులు ప్రస్తుతం కలవరపడుతున్నారు. ఏపీలోని ఆయా మండలాల్లోని సరిహద్దు గ్రామాల నుంచి నిత్యం ఉదయాన్నే పలువురు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు నిరాటంకంగా ప్రయాణాలు సాగిస్తున్నారట.

డేంజర్, రెడ్ జోన్ ప్రాంతాలుగా గుర్తించిన ఏరియాల నుంచి ప్రజల రాకపోకలను మరింత కఠినంగా కట్టడి చేయాల్సిన అవసరం ఏర్పడింది. లేకుంటే సరిహద్దుల్లోని ఏపీ రాష్ట్రం,సూర్యాపేట జిల్లా నుంచి కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రం కావచ్చన్నది ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల ఆందోళనకు అసలు కారణం. మొత్తంగా కరోనాకు సంబంధించి చుట్టు, ముట్టూ గల సూర్యాపేట, సరిహద్దుల్లోని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలను మరింత కలవరపరుస్తున్నాయి.

Comments are closed.

Exit mobile version