దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. గడచిన 24 గంటల్లో దేశంలో కరోనా పాజిటివ్ రోగుల సంఖ్య 2.00 లక్షల సంఖ్యను దాటేసింది. కొత్తగా మొత్తం 2,00,739 కరోనా పాజిటివ్ కేసులు గడచిన ఒక్కరోజులోనే నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదేవిధంగా మరణాల సంఖ్య వెయ్యిని దాటుతూ 1.038 అంకెగా నమోదైంది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,40,74,564కు చేరింది. ఇదే దశలో మరణాల సంఖ్య ఇప్పటి వరకు 1,73,123కు చేరుకుంది. మరోవైపు తెలంగాణా రాష్ట్రంలోనూ కరోనా కోరలు చాస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 3,307 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఎనిమిది మంది మరణించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో కరోనాతో మరణించినవారి సంఖ్య రాష్ట్రంలో 1,788కి చేరుకుంది. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించకుంటే, స్వీయ నియంత్రణ అవలంభించకుంటే పరిస్థితి మహారాష్ట్రలా మారే ప్రమాదం లేకపోలేదని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు నిన్న హెచ్చరించిన సంగతి తెలిసిందే.