ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బుధవారం మరో ఇద్దరు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే రాజకీయ, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకిందని బాలసుబ్రహ్మణ్యం స్వయంగా వీడియో ద్వారా ప్రకటించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే కోలుకుంటానని బాలు చెప్పారు.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా కరోనా సోకింది. గత కొద్ది రోజులుగా జ్వరంతో ఇబ్బంది పడుతున్న మంత్రి బాలినేని వైద్య పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం తాను హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నానని, త్వరలోనే ఇంటికి వస్తానని తన అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు మెసేజ్ ద్వారా తెలిపారు.