మే నెల రెండోవారంలో భారతదేశంలో కరోనా ఉగ్రరూపంం దాలుస్తుంది. ఈ సంఖ్య దేశ వ్యాప్తంగా 75 వేలకు చేరే అవకాశం ఉంది.
మన దేశంలోని ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ, ప్రొటివిటీ అనే అంతర్జాతీయ కన్సల్టింగ్ సంస్థ సంయుక్తంగా దాదాపు మూడు వారాల క్రితం వెల్లడించిన అంశమిది. మే నెల మధ్యలో దేశంలో కరోనా ‘పీక్ స్టేజ్’కి చేరుతుందని ఆయా సంస్థలు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఆయా సంస్థల అధ్యయనమే ప్రస్తుతం నిజమైంది.
దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య బుధవారం నాటికి 74,281కి చేరగా, 2,415 మంది మరణించారు. ఈ విషయంలో మహారాష్ట్ర అత్యధికంగా 24,427 పాజిటివ్ కేసుల నమోదుతో ప్రథమ స్థానంలో ఉండగా, 437 కేసులతో ఒడిషా చివరి స్థానంలో ఉంది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తొమ్మిది, తెలంగాణా పదో స్థానంలో ఉన్నాయి. మరణాలు కూడా అదే స్థాయిలో రికార్డయి ఆయా స్థానాల్లోనే నిలిపాయి.
అయితే భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మే 22వ తేదీ నాటికి 75 వేలకు చేరవచ్చని ఆయా సంస్థల అధ్యయనంలో తేలడం గమనార్హం. దాదాపు మరో 719 కేసులు నమోదైతే అంచనా అంకెల వారీగానూ కుదిరినట్టే. అధ్యయన సంఖ్య ఖచ్చితత్వాన్ని చేరుకున్నట్టే. అందుకు మరో వారం రోజుల వ్యవధి కూడా ఉంది. విశేషమేంటంటే… ‘లాక్ డౌన్’ను మే 15 వరకు పొడిగిస్తే సెప్టెంబర్ 15వ తేదీ వరకు కరోనా రోగుల సంఖ్య సున్నాకు చేరుకుంటుందని కూడా ఆయా సంస్థల అధ్యయనంలో తేలింది. ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ పొడిగించగలిగితే మాత్రం జూన్ నెల మధ్యలోనే కేసుల సంఖ్య శూన్యానికి చేరుతుందని పరిశోధకులు అంచనా వేశారు. ప్రస్తుత లెక్కల ప్రకారం ప్రముఖ ఆంగ్ల మీడియా, ప్రొటివిటీ సంస్థల అంచనా తప్పలేదనే విషయం స్పష్టమవుతోంది.
కానీ… ఓవైపు లాక్ డౌన్ కొనసాగుతున్న పరిస్థితుల్లోనే, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరిచారు. శ్రామిక్ రైళ్లను నడుపుతూ వలస కూలీలను సొంత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణా రాజధాని హైదరాబాద్ లో గడచిన మూడు, నాలుగు రోజులుగా భారీ ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయినప్పటికీ ఆంగ్ల మీడియా, ప్రొటివిటీ సంస్థల అధ్యయనం, అంచనా ప్రకారం జూన్ నెల మధ్యలోనే కరోనా కేసుల సంఖ్య సున్నాకు చేరుకోవాలని కోరుకుందాం.