ఖమ్మం జిల్లా విద్యా సంస్థల్లో కరోనా కలకలం కలిగిస్తోంది. దేశవ్యాప్తంగానేగాక, రాష్ట్రంలోనూ కరోనా కేసులు తగ్గుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా ప్రభుత్వ విద్యా సంస్థల్లో పలువురు విద్యార్థులు కరోనా బారిన పడుతుండడం వారి తల్లి, దండ్రుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నాలుగు రోజుల క్రితం వైరాలోని గురుకుల పాఠశాలలో 29 మంది విద్యార్థులు కరోనా బారిన పడిన ఘటనను మరువకముందే, తాజాగా చింతకాని మండల కేంద్రంలోని హైస్కూల్ లో ఐదుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడం ఈ ఆందోళనకు కారణమైంది.
చింతకాని మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ కు చెందిన కొందరు విద్యార్థులు గడచిన మూడు రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతుండగా, వారికి జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ నేపథ్యంలో చింతకాని జెడ్పీ హైస్కూల్ లో మొత్తం 190 మంది విద్యార్థులుండగా, బుధవారం 103 మంది విద్యార్థులకు, నలుగురు టీచర్లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయిదుగురు విద్యార్థులకు కరోనా సోకిన్టలు నిర్ధారణ జరిగింది. ఇందులో ఇద్దరు బాలికలు, ముగ్గురు బాలురు ఉన్నారు.
కాగా ఈనెల 21వ తేదీన వైరా గురుకుల పాఠశాలకు చెందిన 29 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనానంతరం గురుకుల పాఠశాలలో విద్యనభ్యసించే పదో తరగతి, ఇంటర్ విద్యార్థులను మినహా మిగతావారిని వారి వారి ఇళ్లకు పంపించారు. ఈ నేపథ్యంలో చింతకాని జెడ్పీ హైస్కూల్ కు చెందిన ఐదుగురు విద్యార్థులకు కరోనా బారిన పడడం ఆందోళకర పరిణామంగా భావిస్తున్నారు.
ఫొటో: చింతకాని జెడ్పీ స్కూల్ విద్యార్థులకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించిన దృశ్యం