ఫొటోను ఓసారి నిశితంగా చూడండి. భర్త, భార్య, కుమారుడు, కుమార్తె. చూడ చక్కని కుటుంబం. ఫొటోలోని కుటుంబ పెద్ద పేరు నర్సయ్య. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పసివేదలకు చెందిన నర్సయ్య ఈనెల 16వ తేదీన మరణించాడు. నర్సయ్య మృతితో దిక్కుతోచని ఆయన భార్య సునీత, కుమారుడు ఫణికుమార్, కుమార్తె అపర్ణ ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైల్వే బ్రిడ్జి పైనుంచి గోదావరి నదిలోకి దూకి ఈ ముగ్గురు గల్లంతయ్యారు.
ఈ విషాద ఘటనలో గుండె తరుక్కుపోయే అంశమేమిటో తెలుసా? నర్సయ్య కరోనాతో మృతి చెందిన తర్వాత ఆయన బంధువుల, స్నేహితుల నుంచి కనీస పలకరింపు కూడా లేదట. దీంతో మనస్తాపానికి గురైన నర్సయ్య భార్య, కుమారుడు, కుమార్తె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
నర్సయ్య కుటుంబానికి వ్యవసాయమే జీవనాధారం. ఇంటి పెద్ద దిక్కును కరోనా మహమ్మారి కబలించడం, బంధువులు, స్నేహితులు కనీసం పలకరించకపోవడమే నర్సయ్య కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
భయం వల్లే కరోనా సోకినవారు ఎక్కువగా చనిపోతున్నారని మన నాయకులు ప్రకటించడం సంగతేమోగాని, అత్మీయుల, స్నేహితుల నుంచి కనీస పలకరింపునకు కూడా కరోనా దూరం చేయడం, దుఃఖంలో గల కుటుంబానికి కాస్త ధైర్యాన్నిచ్చే పరిస్థితులు కొరవడడమే అసలు విషాదం.