సూర్యాపేట జిల్లా కేంద్రంలో కరోనా మళ్లీ కలకలం సృష్టించింది. ఒకే కుటుంబానికి చెందిన 22 మందికి కరోనా సోకినట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. సూర్యాపేట పట్టణంలోని యాదాద్రి గేటెడ్ కమ్యూనిటీ లో నివసించే ఒకే కుటుంబానిక చెందిన 22 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. ఇదే గేటెడ్ కమ్యూనిటీలో మూడు రోజుల క్రితం చనిపోయిన ఓ వ్యక్తి అంత్యక్రియలకు బంధుగణం భారీ సంఖ్యలో హాజరైంది.
వీరిలో కొందరికి జలుబు ద్వారా కరోనా లక్షణాలు కనిపించడంతో మొత్తం 38 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఇందులో 22 మందికి పాజిటివ్ రిజల్ట్ రాగా, వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం. అయితే వీరెవరికీ కరోనా స్ట్రెయిన్ లక్షణాలు లేవని సూర్యాపేట జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం వీరంతా హోం ఐసొలేషన్ లో ఉన్నట్లు చెప్పారు. కాగా రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ లేదని, ఫస్ట్ వేవ్ కూడా తగ్గుముఖం పట్టిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ శుక్రవారం చెప్పారు. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోందన్నారు.