కరోనా వైరస్ అంశంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. ఈ సాయంత్రం కల్లా ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. కరోనా అంశంలో అప్రమత్తత గురించి తీసుకోవలసిన చర్యలపై ప్రభుత్వం అత్యంత వేగంగా చర్యలకు ఉపక్రమిస్తోంది. రేపటి నుండి తెలంగాణలో మాల్స్, సినిమా హాల్స్ మూసి వేసే దిశగా ప్రభుత్వం యోచిస్తోంది. పెళ్లిళ్ళు, ఇతర పంక్షన్ల పేరుతో ఎక్కువ మంది ప్రజలు ఒకే చోటా గుమిగూడకుండా ఉండాలని సూచిస్తోంది. ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాస్ మోబలైజేషన్ చేయకూడదని నిర్దేశిస్తోంది. సాయంత్రం ఆరు గంటలకు కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కరోనా వైరస్ అంశంలో ప్రభుత్వం తన కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి.

కాగా కరోనా వైరస్ పై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, (కోవిడ్-19) వైరస్ దేశంలో 65 మందికి సోకిందని, వీరిలో ఇద్దరు చనిపోయారని, 10 మందికి పూర్తిగా తగ్గిపోయిందన్నారు. అదేవిధంగా 8 రాష్ట్రాల్లో పాఠశాలలు, 6 రాష్ట్రాల్లో పాఠశాలలు, సినిమా హాళ్లు మూసివేశారన్నారు. కరోనా వైరస్ తో తెలంగాణకు ప్రమాదం ఏమీ లేదంటూనే వెయ్యి కాదు ఐదు వేల కోట్లైనా ఖర్చు చేస్తామన్నారు. ఎలాంటి ఉత్పాత పరిస్థితి వచ్చినా, ఎదుర్కొనేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉన్నదని, వైద్య బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో బస్సులు, వందల సంఖ్యలో రైళ్లు వస్తాయని, దేశ విదేశాల నుంచి రోజూ 500 పైగా విమానాలు వస్తాయన్నారు.

శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ట్రాఫిక్ పెరిగిందని, రోజూ 55 వేల మంది ఎయిర్ పోర్టులో దిగుతుంటారని, ఎక్కుతుంటారని చెప్పారు. ఇటలీ నుంచి హైదరాబాద్ కు వచ్చిన వ్యక్తికి పాజిటివ్ అని తేలిపోయిందని, కాబట్టి మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. కోటికి పైగా జనాభా గ్రేటర్ హైదరాబాద్ లో ఉందని, లక్షల జనాభా ఉన్న కార్పొరేషన్లు ఉన్నాయని, మాస్కులు అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. వైద్యులకు ప్రత్యేక మాస్కులు ఏర్పాటు చేస్తామని, ఫంక్షన్లు, సామూహిక సమావేశాలపై ఆలోచిస్తున్నామన్నారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

Comments are closed.

Exit mobile version