ఖమ్మం నగరంలోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిపై కరోనా మహమ్మారి పంజా విసిరింది. ఇద్దరు గైనిక్ డాక్టర్లతోపాటు హెడ్ నర్స్ సహా నలుగురు నర్సులు గురువారం కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో వీరికి పాజిటివ్ రిజల్ట్ వచ్చినట్లు సమాచారం. ఇక్కడి ప్రభుత్వాసుపత్రిలోని మాతా, శిశు కేంద్రంలోని గైనిక్ విభాగంలో పనిచేసే ఇద్దరు డాక్టర్లు ఇప్పటికే కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు. గురువారం నాటి ఘటనతో కరోనా సోకిన ప్రభుత్వాసుపత్రి డాక్టర్ల సంఖ్య నాలుగుకు చేరింది. అంతకు ముందు మరో ప్రయివేట్ వైద్యుడు కూడా కరోనా బారిన పడ్డారు.
తాజా పరిణామంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలోని మాతా, శిశు విభాగాన్ని తాత్కాలింకగా మూసివేసి ఫ్లోర్ మొత్తం శానిటైజ్ చేస్తున్నారు. అంతేగాక ఓపి సేవలను నిలిపేశారు. మూడు రోజుల అనంతరం పరిస్థితిని బట్టి ఓపి సేవలు అందించే అవకాశాలున్నట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఇదే దశలో గురువారం మరో 30 మంది నర్సుల నుంచి కరోనా టెస్టుల కోసం శాంపిళ్లు తీసుకున్నారు. ఇందులో ఎంత మందికి పాజిటివ్ వస్తుందోనని ఆసుపత్రి వర్గాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి.
మాతా, శిశు విభాగానికి గర్భిణీ స్త్రీల వెంట వారి సంబంధీకులు గుంపులు గుంపులుగా రావడమే కరోనా వ్యాప్తికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఇప్పటికైనా అత్యవసరమైతే తప్ప గర్భిణీల వెంట ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావద్దని ఆసుపత్రి వర్గాలు సూచిస్తున్నాయి. మొత్తంగా ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు, నర్సులు కరోనా బాధితులుగా మారడం కలకలం కలిగిస్తోంది.