మెడికల్ స్టూడెంట్స్ పాల్గొన్న ఓ ఈవెంట్ పై కరోనా పంజా విసిరింది. ఫలితంగా 66 మంది వైద్య విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. కర్నాటకలోని ధర్వాడ్ లోని ఓ మెడికల్ కళాశాలకు చెందిన ఈ 66 మంది విద్యార్థులు రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారే కావడం గమనార్హం.
ధార్వాడ్ లోని ఎస్ డీ ఎం మెడికల్ కళాశాలలో మొత్తం 400 మంది విద్యార్థులుండగా, ఇందులో 300 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఫలితాల్లో మొత్తం 66 మంది మెడికల్ స్టూడెంట్స్ కు కరోనా సోకినట్లు తేలింది. ఇటీవలే ఓ కాలేజీలో నిర్వహించిన ఈవెంట్ లో వీరందరూ పాల్గొన్నారని, అక్కడే వీరికి వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నారు.
ఈ ఘటనతో ముందు జాగ్రత్త చర్యగా కాలేజీలోని రెండు హాస్టళ్లను మూసేశారు. రెండు హాస్టళ్లను సీజ్ చేశారు. మిగతా 100 మంది వైద్య విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. బాధిత విద్యార్థులను క్వారంటైన్ లో ఉంచారు.
ఇదిలా ఉండగా ఒడిషాలోని విమ్సార్ కు చెందిన వైద్య కళాశాలలోనూ కరోనా వైరస్ పంజా విసిరింది. ఈ కళాశాలలో వైరస్ సోకిన విద్యార్థుల సంఖ్య 54కు పెరిగినట్లు జాతీయ వార్తా సంస్థలు నివేదిస్తున్నాయి. ఈ సంఘటనకు కూడా కళాశాలలో నిర్వహించిన ఈవెంట్ కారణంగా అధికారులు భావిస్తున్నారు.