‘శకునం చెప్పే బల్లి కుడితిలో పడిన’ చందమిది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా, దాని కట్టడికి మాస్క్ ధరించడం అనివార్యమని ప్రభుత్వాలు, వైద్యులు పదే పదే చెబుతున్న సంగతి తెలిసిందే కదా! మరి మాస్కులు తయారు చేసే కంపెనీలోనే కరోనా కలకలం కలిగిస్తే…? ఫ్యాక్టరీలో పని చేస్తున్నవారే కరోనా పేషెంట్లుగా మారితే…? పరిస్థితి అత్యంత ఆందోళనకరమే.
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో సరిగ్గా ఇదే జరిగింది. ఇక్కడ మాస్కులు తయారు చేస్తున్న ఓ కంపెనీలో 70 మంది కార్మికులకు కరోనా వైరస్ సోకింది. వైద్య పరీక్షల్లో వారికి పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. మాస్కుల తయారీ కంపెనీ లాక్ డౌన్ నిబంధనలను బేఖాతర్ చేసిందట. అందువల్లే ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు సమాచారం.
దీంతో పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, తయారైన మాస్కులను సీజ్ చేయాలని ఆదేశించారు.