మొత్తానికి చిన జీయర్ స్పందించారు. వనదేవతలు సమ్మక్క, సారలమ్మలపై తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ వివరణలో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లుగాని, పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్లుగాని చిన జీయర్ ప్రకటించకపోవడమే అసలు విశేషం. శుక్రవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో వనదేవతల గురించి తాను చేసిన వ్యాఖ్యలపై సుదీర్ఘ వివరణ ఇచ్చేందుకు చేసిన ప్రయత్నంలో తన మాటలు తప్పు అనే భావనను ఆయన ఎక్కడా వ్యక్తం చేయకపోవడాన్ని ఆదివాసీ సంఘాలతోపాటు సమ్మక్క భక్తులు ఆక్షేపిస్తున్నారు.
వనదేవతలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తాను 20 ఏళ్ల క్రితం చేశానని అంగీకరిస్తూనే, అలా వ్యాఖ్యానించడం పట్ల కనీసం విచారం వ్యక్తం చేస్తున్నాని కూడా జీయర్ చెప్పలేదు. సమ్మక్క, సారలమ్మలను గ్రామ దేవతలుగానే మీడియా సమావేశంలో జీయర్ పదే పదే అభివర్ణించారు.తన వ్యాఖ్యల తాత్పర్యం తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తే, వారిపై జాలిపడాల్సి వస్తుందన్నారు. అందరినీ గౌరవించాలనేది తమ విధానమని చెబుతూనే, ఆదివాసీల సంక్షేమం కోసం తమ వికాస తరంగిణి సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు.
కాగా ఈ వివాదంపై చిన జీయర్ ఇచ్చిన వివరణ తీరును పలువురు విమర్శిస్తున్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు జంపన్న చిన జీయర్ వివరణను అక్షరాక్షరాన ఆక్షేపించారు. తన ఫేస్ బుక్ వాల్ పై జంపన్న స్పందిస్తూ, ‘మోసాలు, కుట్రలు, దగా, వ్యభిచారం, హత్యలు, రియల్ ఎస్టేట్ బ్రోకరిజం, రాజకీయ, వ్యాపార సెటిల్మెంట్లతో కూడుకున్నవే బాబాల ఆశ్రమాలు’గా అభివర్ణించారు. అలాంటి ఆశ్రమాల్లో ఒకటై వందల కోట్ల వ్యాపారాలతో వర్ధిల్లుతున్నదే చిన జీయర్ స్వామి ఆశ్రమమని అన్నారు. కొంత కాలంగా చిన జీయర్ స్వామి వందల ఎకరాలలో వేల కోట్లకు పడగలెత్తిన విషయం ప్రజల్లో బహిర్గతమవుతుంటే, మేడారం జాతర మోసపూరిత వ్యాపారంగా మారిందని స్వాముల వారు మాట్లాడటం అంటే మనుధర్మ (బ్రాహ్మణ) పెత్తనం కోసం మాత్రమే కాకుండా తన వ్యాపార సామ్రాజ్య గుత్తాధిపత్యాన్ని నెలకొల్పడంలో భాగమేనని జంపన్న అన్నారు. ప్రజల్లో, ఆదివాసుల్లో స్వామిపై తీవ్రమైన వ్యతిరేకత, అసహ్యం మిన్నంటుతున్న స్థితిలో పరమ మూర్ఖత్వంతో కూడుకున్న తన ప్రకటనలపై క్షమాపణ చెప్పకుండా కుతర్కంతో కూడిన చిక్కడు దొరకడు అన్న పద్ధతిలో కొనసాగించిన ప్రెస్ మీట్ ద్వారా చిన జీయర్ అచ్చమైన మనుధర్మ వ్యాపారి అని నిరూపించుకున్నాడుని జంపన్న వ్యాఖ్యానించారు.
ఇంతకీ ఈ మొత్తం వివాదంలో చిన జీయర్ ఏం మాట్లాడరనేది దిగువన గల వీడియో క్లిప్ ద్వారా వీక్షిస్తూ వినేయండి.