మావోయిస్టు నక్సలైట్లు ఓ కాంట్రాక్టర్ ను దారుణంగా హత్య చేశారు. ఓ వంతెన నిర్మాణపు పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ ను నక్సలైట్లు కొట్టి చంపడం కలకలానికి దారి తీసింది. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా గంగళూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగిన ఈ ఘటనను స్థానిక ఎస్పీ కమలోచన్ కశ్యప్ ధృవీకరించారు.
గంగళూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కోటార్ గ్రామంలో ధర్మేంద్ర అనే కాంట్రాక్టర్ వంతెన పనులు నిర్వహిస్తున్నారు. పనులు సాగుతున్న తీరును పర్యవేక్షించడానికి వెళ్లిన ధర్మేంద్రపై నక్సలైట్లు పదునైన ఆయుధంతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన కాంట్రాక్టర్ ను చికిత్స కోసం చేర్పాల్ ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.
చికిత్స పొందుతూనే కాంట్రాక్టర్ ధర్మేంద్ర తన ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు చెప్పారు. గడచిన వారం రోజులుగా బీజాపూర్ జిల్లాలో నక్సలైట్ల చేతుల్లో పలువురి హత్యోదంతాలు జరుగుతూనే ఉన్నాయి.
ఫొటో: కాంట్రాక్టర్ ధర్మేంద్ర