తెలంగాణా కొత్త సచివాలయ నిర్మాణపు పనుల ఛాన్స్ షాపూర్జీ-పల్లోంజీ సంస్థ దక్కించుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సమీకృత కొత్త సచివాలయ నిర్మాణపు పనుల కోసం తెలంగాణా ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 500 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న కొత్త సెక్రటేరియట్ నిర్మాణపు పనుల టెండర్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్జీ-పల్లోంజీ సంస్థ చేజిక్కించుకున్నట్లు సమాచారం.
కొద్ది సేపటి క్రితమే ఖరారు చేసినట్లు తెలుస్తున్న టెండర్లలో ఈ సంస్థ ఎల్-1గా నిలిచిందని ప్రచారం జరుగుతోంది. పన్నెండు నెలల్లోగానే కొత్త సచివాలయ నిర్మాణపు పనులు పూర్తి చేయాలనే ఖచ్చితమైన నిబంధనను ప్రభుత్వం ఈ టెండర్లలో విధించడం గమనార్హం. టెండర్ల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వం-షాపూర్జీ-పల్లోంజీ సంస్థల మధ్య అగ్రిమెంట్ జరగనున్నట్లు తెలిసింది. త్వరలోనే సెక్రటేరియట్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశముందంటున్నారు.
కాగా ఈ టెండర్లలో మరో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్అండ్ టీ చివరి వరకు పోటీలో నిలవగా, ఎల్-1గా షాపూర్జీ-పల్లోంజీ సంస్థ నిలవడంతో ఆ సంస్థకే టెండర్ దక్కినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా కొత్త సెక్రటేరియట్ నిర్మాణపు పనుల టెండర్ల ఖరారు సమాచారం అధికార పార్టీ వర్గాల నుంచే లీకైనట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నాయకులకు చెందిన ఓ మీడియా సంస్థలో పనిచేసే జర్నలిస్టు ఒకరు నడుపుతున్న ‘వాట్సాప్’ గ్రూపు ద్వారా సమాచారాన్నీ లీక్ చేయడం, విషయం మీడియాలో ప్రచారంలోకి రాగానే ఆయా మెసేజ్ ను డిలీట్ చేయడం కూడా చర్చకు దారి తీసింది.