దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జీవించి ఉన్నపుడు కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ లీడర్ వి. హన్మంతరావును ఏమని పిలిచేవారో తెలుసా? ‘హన్మంతూ…’ అని అప్యాయంగా పిలిచి అక్కున చేర్చుకునేవారని వీహెచ్ రాజకీయ సమకాలికులు ఇప్పటికీ చెబుతుంటారు. రాజీవ్ గాంధీని ఆ ఎల్టీటీఈ వాళ్లు పొట్టన పెట్టుకుని ఉండకపోతే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వీహెచ్ ఎప్పుడో సీఎం అయ్యేవారని కూడా గుర్తు చేస్తుంటారు. ‘హన్మంతు’ అంటే రాజీవ్ గాంధీకి అంతిష్టమన్నమాట. రాజీవ్ గాంధీ మరణించిన సందర్భంగా హన్మంతరావు కార్చిన కన్నీటి దృశ్యం ఇప్పటికీ కొందరికి కళ్లముందు కదలాడుతుంటుంది. బహుషా వీహెచ్ తన దశాబ్ధాల రాజకీయ జీవితంలో అంతగా మరెప్పుడూ రోదించి ఉండకపోవచ్చు. అంతటి హన్మంతరావును ఇప్పటి కాంగ్రెస్ నేతలు, ముఖ్యంగా పార్టీ అధిష్టానం కూడా పట్టించుకోకపోవడం కాస్త విషాదకరమే.
తనకు 2018 నుంచి పార్టీ అధిష్టానం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని, ఎన్నిసార్లు అపాయింట్మెంట్ కోరినా ఫలితం లభించడం లేదని పది రోజుల క్రితమే వీహెచ్ వాపోయారు. ఢిల్లీవాళ్లు ఏం చెబితే అది వినాలా? రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ సైతం తన ఫోన్ ఎత్తడం లేదని, తానేమైనా రౌడీనా? దొంగనా? భూకబ్జాదారునా? అంటూ మండిపడ్డారు. అంతేకాదు మాణిక్కం ఠాగూర్ అమ్ముడుపోయారని, సోనియాకు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారని కూడా ధ్వజమెత్తారు. వీహెచ్ గుండె ఇంతలా మండిపోవడానికి కారణం తెలుసుగా? తెలంగాణా కొత్త పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డిని పార్టీ ఖరారు చేసిందనే వార్తలే ఇందుకు కారణం. వాస్తవానికి ఈ విషయాన్ని పార్టీ ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. పత్రికల్లో వచ్చిన వార్తలు ప్రామాణికంగా వీహెచ్ అగ్గిలం మీద గుగ్గిలమయ్యారు. రేవంత్ రెడ్డికి పీసీసీ పదవిని ఇస్తే తాను కాంగ్రెస్ ను వదిలేస్తానని, టీడీపీని రేవంత్ నిండా ముంచాడని, కాంగ్రెస్ పార్టీని కూడా బొందపెడతాడని వీహెచ్ నిందించారు.
సరే.., ప్రజాస్వామ్యం పాళ్లు కాస్త ఎక్కువే గల కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఏదైనా మాట్లాడొచ్చు. ఇలా మాట్లాడేవారి తీరును ప్రశ్నించి, నోటీసులు ఇచ్చి, చర్యలు తీసుకునేసరికి యేళ్లకేళ్ల కాలం గడిచిపోతుంది. పార్టీ మేలు కోరి వీహెచ్ తన భక్తిని ప్రదర్శించి ఉంటారులే… అని కాంగ్రెస్ కేడర్ కూడా తమాయించుకుని ఉంటుంది. అందునా పార్టీలో అత్యంత సీనియర్ అయిన వీహెచ్ ను ప్రశ్నించే దమ్మూ, ధైర్యం కూడా ఎంత మందికి ఉంటుందనేది పార్టీ శ్రేణుల సందేహం కూడా. రేవంత్ ను పీసీసీ అధ్యక్షుడు కాకుండా తనదైనశైలి వ్యాఖ్యల ద్వారా అడ్డుకుంటున్న వి. హన్మంతరావు తాజాగా ఏమంటున్నారనేది కూడా ఆసక్తికర పరిణామమే కదా! కాంగ్రెస్ పార్టీని కిలోమీటర్ల లోతున పాతిపెట్టే దిశగా పలు రాజకీయ చర్యలు తీసుకున్న కేసీఆర్ ను సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్ మెచ్చుకుంటే అంతకన్నా మంచివార్త మరేమీ ఉండకపోవచ్చు కూడా.
ఔను… కాంగ్రెస్ సీనియర్ నేత వి. హన్మంతరావుకు కేసీఆర్ పరిపాలన బహు పసందుగా తోచింది. కుల సంఘాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా బీసీలను పట్టించుకోలేదని, బీసీలను గౌరవిస్తున్న సీఎం కేసీఆర్ ను అభినందిస్తున్నట్లు కూడా హన్మంతరావు చెప్పారు. నిన్న హైదరాబాద్ లో జరిగిన మున్నూరుకాపు మహాసభ ఐక్యకార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వీహెచ్ కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. హన్మంతరావు తాజా వ్యాఖ్యల వార్తలను చదివిన కాంగ్రెస్ వీరాభిమానులు, ముఖ్యంగా రేవంత్ అనుచరగణం ఏమంటున్నదో తెలుసా? ‘సీఎం కేసీఆర్ అభివృద్ధిని చూసిన వీహెచ్ కళ్లకు రేవంత్ పీసీసీ అధ్యక్షునిగా నచ్చకపోవడంలో వింతేముంది?’ అని వెటకరిస్తున్నారు. అదీ సంగతి.