తన రాజకీయ లక్ష్యాన్ని చేరుకునేందుకు కాంగ్రెస్ నేత, మల్కాజిగిరి ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయానికి సిద్ధపడ్డారా? ఇందుకోసం రెండు ప్లాన్లను కూడా సిద్ధం చేసుకున్నారా? ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించే వైఖరిని బట్టి మాత్రమే రేవంత్ అడుగులు వేస్తారా? ఔననే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అయితే తాను రూపొందించుకున్నట్లు ప్రాచుర్యంలోకి వచ్చిన రెండు ప్లాన్లు కూడా ఒకే కార్యక్రమ నిర్వహణకు నిర్దేశించుకోవడం విశేషం.
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం, తాను ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడమే రేవంత్ ప్లాన్లకు ప్రామాణికంగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ను ఎదుర్కోవడం తమ నాయకుడి వల్ల మాత్రమే సాధ్యమవుతుందని రేవంత్ అనుచరులు గట్టిగా విశ్వసిస్తున్నారు. అయితే రేవంత్ ప్రయత్నాలకు సీనియర్లుగా చెప్పకునే కొందరు పార్టీ నాయకులే అడుగడుగునా అడ్డుతగులుతున్నారని వారు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కనీసం వచ్చే ఎన్నికల్లోనైనా అధికారంలోకి తీసుకువచ్చేందుకు రేవంత్ రెడ్డి పకడ్బందీ పథక రచన చేశారంటున్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిని తాజాాగా మార్చిన పరిణామాలు సైతం రేవంత్ రెడ్డికి సానుకూలంగా ఆయన అనుచరగణం భావిస్తోంది. పీసీసీ అధ్యక్ష పదవి రేసులో గల రేవంత్ యత్నాలకు కాంగ్రెస్ లోని ఓ వర్గపు నేతలు మోకాలొడ్డుతున్నారనే వార్తలు కూడా వ్యాప్తిలో ఉన్నాయి. తమ నాయకుడికి పీసీసీ పదవి అప్పగిస్తే కేసీఆర్ ను ధీటుగా ఎదుర్కుంటారని, కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువస్తారని, ఆ శక్తి మరెవరికీ లేదని కూడా రేవంత్ వర్గీయులు చెబుతున్నారు. ఇందుకోసం రేవంత్ పీసీసీ అధ్యక్ష పదవి కోసం వేచి చూసే ధోరణిలోనే ఉన్నారు.
అయితే ఇదే పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ‘పాదయాత్ర’ నిర్వహణకు రేవంత్ సిద్ధపడ్డారనేది తాజా ప్రచారపు సంచలనం. ప్లాన్ ‘ఎ’ ప్రకారం ఈ పాదయాత్రకు పార్టీ అధిష్టానం అనుమతిస్తే సరి, లేదంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మార్గాన్నే రేవంత్ అనుసరిస్తారంటున్నారు. రాజశేఖర్ రెడ్డితోపాటు ఆయన తనయుడు జగన్ కూడా పాదయాత్రల ద్వారానే తమ లక్ష్యాన్ని చేరుకున్నారని రేవంత్ బలంగా నమ్ముతున్నట్లు ఆయన అనుచరగణం చెబుతోంది. పాదయాత్ర నిర్వహణ అంశంలో రేవంత్ యత్నానికి కాంగ్రెస్ లోని నాయకులెవరైనా అడ్డుకుంటే ప్లాన్ ‘బి’ కూడా రేవంత్ వద్ద సిద్ధంగా ఉందంటున్నారు.
ఈమేరకు రాష్ట్రంలో తానే స్వయంగా కొత్త పార్టీని ఏర్పాటు చేయడమే ప్లాన్ ‘బి’ గా చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి అంటే 2023 నాటికి కేసీఆర్ పదేళ్ల పాలనపై ప్రజల్లో గల వ్యతిరేకతను కూడగట్టడమే రేవంత్ పాదయాత్ర ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు. రేవంత్ పాదయాత్ర యత్నాలకు తెలంగాణాలోనే కాదు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ‘రెడ్డి’ సామాజిక వర్గపు నేతల అండదండలు కూడా లభించవచ్చని అంచనా వేస్తున్నారు. అంతేగాక తెలంగాణాలోని తెలుగుదేశం పార్టీకి చెందిన కేడర్ కూడా తమ నాయకుడి వెంట నడుస్తుందని రేవంత్ వర్గీయులు భావిస్తున్నారు.
శాసనమండలి మాజీ చైర్మెన్ స్వామిగౌడ్ ఇటీవల రేవంత్ రెడ్డి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బడుగు, బలహీన వర్గాలకు రేవంత్ చేతికర్రగా మారారని, ఇటువంటి నాయకులకు అండగా నిలవాల్సిన అవసరముందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను రేవంత్ ఎదుర్కునే వ్యూహరచనలో టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం అండదండలు కూడా అంతర్గతంగా ఉంటాయంటున్నారు. కోదండరాం స్వతహాగా పొలిటిషియన్ కాకపోవడం వల్లే ఆయన పార్టీ ఆశించిన స్థాయిలో ఎదగలేదనే వాదన కూడా ఉంది.
ఈ పరిస్థితుల్లో పాదయాత్ర నిర్వహణ ద్వారా మాత్రమే ప్రజాభిమానాన్ని చూరగొనగలమని, పార్టీపై పట్టు సాధించగలమని రేవంత్ గట్టిగా విశ్వసిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా ప్లాన్ A, B లతో రేవంత్ రెడ్డి తన లక్ష్య సాధనకై అడుగులు వేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం తెలంగాణా రాజకీయాల్లో హాట్ టాపిక్.