ఫొటోను నిశితంగా గమనించండి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెవిలో గుసగుసలాడుతున్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా? మాస్క్ ఉండడం వల్ల గుర్తు పట్టలేకపోవచ్చు. ఆయన మరెవరో కాదు… టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీప బంధువు, వరుసకు ఉత్తమ్ కు సోదరుడు, హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్, గత ఎన్నికల్లో ఈటెల రాజేందర్ పై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నాయకుడు. పార్టీపరంగా ఇన్ని అర్హతలు గల కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెవిలో ఏదో గుసగుసలాడుతున్న ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే అసలు విశేషం. కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరబోతున్నారంటూ కొందరు ఊదరగొడుతున్నారు కూడా. కేవలం కారు వద్ద కేటీఆర్ చెవిలో ఏదో చెబుతున్నట్లు కనిపిస్తున్న ఈ ఫొటో మాత్రమే కాదు, కేటీఆర్ భోజనం చేస్తుండగా అదే టేబుల్ వద్ద గల కుర్చీలో కూర్చున్న కౌశిక్ రెడ్డి ఇక్కడ కూడా ఏదో చెబుతున్నట్లు కనిపిస్తున్నది. ఇదే చిత్రంలో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కూడా ఉన్నారు.
ఇప్పుడీ ఫొటోలకు సంబంధించిన దృశ్యాలు తెలంగాణా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మంత్రివర్గం నుంచి ఈటెల రాజేందర్ ను బర్తరఫ్ చేసిందే తడవుగా టీఆర్ఎస్ నేతలను మించి కౌశిక్ రెడ్డి తన వాయిస్ పెంచడం కూడా తెలిసిందే. ఈటెల రాజేందర్ భూముల వ్యవహారంపై ప్రభుత్వం చేస్తున్న విచారణకు శృతి కలిపిన చందంగా కౌశిక్ రెడ్డి కోట్ల రూపాయల ఆరోపణలను ఈటెల రాజేందర్ పై గుప్పించారు. కౌశిక్ రెడ్డి ఆరోపణలకు అధికార పార్టీ అనుబంధ మీడియా సంస్థలు కూడా భారీ ప్రాధాన్యతను కల్పించాయి. గడచిన 40 రోజుల రాజకీయ పరిణామాల్లో ఈటెల రాజేందర్ చివరికి బీజేపీలో చేరడం ఖాయంగా తేలిపోయింది. ఈ నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డి శుక్రవారం మంత్రి కేటీఆర్ తో సన్నిహితంగా ఉన్న, ఆయన చెవిలో ఏదో చెబుతున్నట్లు కనిపిస్తున్న ఫొటోలు రాజకీయ చర్చకు దారి తీశాయి. కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నారనే ప్రచారం ఇందులో భాగమే.
అయితే ఈ విషయంలో కౌశిక్ రెడ్డి వాదన భిన్నంగా ఉండడమే అసలు విశేషం. మంత్రి కేటీఆర్ ను తాను కలిసినట్లు సోషల్ మీడియా లో ఫొటో వైరల్ గా మారిందని, ఈ విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందంటున్నారు కౌశిక్ రెడ్డి. తన చిన్ననాటి మిత్రుని తండ్రి చనిపోగా, దశదిన కర్మకు తాను వెళ్ళానని, వారి ఇల్లు తన ఇంటి కాంపౌండ్ వాల్ పక్కనే ఉంటుందని చెప్పారు. తాను అక్కడ ఉన్న సమయంలోనే కేటీఆర్ అక్కడికి వస్తే కలిశానని, దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దన్నారు. రాబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తాను కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేస్తానని, కాంగ్రెస్ జెండాను హుజురాబాద్ లో ఎగురవేస్తానని కౌశిక్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చుకోవడం కొసమెరుపు.