‘నక్సలైట్లు… సివిల్ వార్…ప్రకృతి రంగప్రవేశం… కేసీఆర్ పై తిట్ల పర్వం… మల్కాజిగిరిలో తన గెలుపు, నిజామాబాద్ లో కవిత ఓటమి’ వంటి అనేక అంశాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అమెరికాలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణా రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఓ వైపు ఆందోళన, మరోవైపు ఆక్రోశం, ఇంకోవైపు వేదాంతం ప్రస్ఫుటింపజేసే విధంగా రేవంత్ వ్యాఖ్యలు ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. న్యూజెర్సీలో ఎన్నారైలు ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి తన సుదీర్ఘ ప్రసంగంలో ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే క్లుప్తంగా… చదవండి..
‘రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. కొడంగల్ లో ఓడిపోతానని నేను అనుకోలేదు. మల్కాజ్ గిరిలో గెలుస్తానని కూడా అనుకోలేదు. అవకాశాలు ఎప్పుడు ఎలా తలుపు తడతాయే చెప్పలేం. కేసీఆర్ వచ్చాక రాజకీయాలకు ఎక్కడ లేని కళంకం తెచ్చారు. ఇలాంటి తెలంగాణ కోసం కాంగ్రెస్ రాష్ట్రం ఇవ్వలేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని తమ మ్యానిఫెస్టోలో ఎక్కడా హామీ ఇవ్వలేదని కేసీఆర్ చెబుతున్నారు. ఆర్టీసీని 50 శాతం ప్రైవేటీకరిస్తామని కూడా మ్యానిఫెస్టోలో చెప్పలేదు కదా! అది ఎలా చేస్తున్నారు!?
అదేమంటే ప్రతిపక్షం ఉండ కూడదు… అభివృద్ధికి అడ్డం అంటాడు. ప్రపంచంలో ఎంత పెద్ద సమస్య అయినా చర్చల ద్వారానే పరిష్కారం అవుతుంది… అలాంటిది చర్చే వద్దంటాడు. ఆ చర్చలతోనే తెలంగాణ వచ్చింది, ఆ పోరాటాలు, ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలతోనే తెలంగాణ వచ్చిందన్న విషయం మర్చిపోతే ఎలా? నియంతలా పాలిస్తానంటే ఎంత కాలం భరించాలి!? మాట్లాడితే నా కుటుంబం ఉద్యమంలో ఉంది అంటాడు. ఏం చేసింది ఆయన కుటుంబం ఉద్యమంలో… ప్రజలు వంటావార్పు చేస్తే కొడుకు అల్లుడు వచ్చి పప్పన్నం తినిపోయారు. పట్టుచీర కట్టుకుని, బెంజ్ కారులో వచ్చి కూతురు బతుకమ్మ ఆడిపోయింది. ఇంత మాత్రానికే ఉద్యమంలో ఉన్నాం అని చెప్పుకుంటే… ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ల కుటుంబాలు ఏమనాలి!? ఏమిచ్చి వాళ్లరుణం తీర్చుకోవాలి!? నువ్వు వెళ్లడానికి గుడి కట్టుకున్నావు… ఉండడానికి గడి కట్టుకున్నావు… చనిపోయిన వాళ్ల గుర్తుగా ఓ స్థూపం కట్టలేకపోయావు. కేసీఆర్ ను నేను గట్టిగా తిడితే ఎందుకలా తిడతావు అని కొందరు మిత్రులు అడుగుతుంటారు… ఉస్మానియా యూనివర్సిటీలో మురళీ అనే విద్యార్థి ఉద్యమాలు చేసినోడు, ఉద్యోగం లేక, ఉపాధి దొరకక ఆశలు అవిరై, లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ వస్తే చావులుండవు, ఆత్మహత్యలుండవు అని కేసీఆర్ అనేవాడు. ఇప్పుడేం జరుగుతోంది.
నక్సల్స్ పేరుతో కేసులు పెడుతున్నారు. ట్యాంక్ బండ్ పై ఎంత మంది ఆర్టీసీ కుటుంబాల ఆడబిడ్డల తలలు పగిలాయో చూడండి. కోర్టు చెప్పినా వినకపోతే, ప్రతిపక్షాలు చెప్పినా వినకపోతే కేసీఆర్ ను తిట్టకుండా ఏం చేయాలో మీరే చెప్పండి. ప్రగతి భవన్ ముట్టడికి ఆర్టీసీ కార్మికులు పిలుపునిస్తే… దానిలో పాల్గొనకుండా ఇంట్లో దుప్పటికప్పుకుని పడుకోమంటారా…!? కేసీఆర్ ఉద్యమంలో వాడిన లాంటి భాష మేం ఎక్కడా వాడ లేదు. చదువుకున్నానని, సంస్కారవంతుడినని చెప్పే కేటీఆర్ పోలీసులపై ఏం భాష వాడాడో యూట్యూబ్ లో చూడండి. కేసీఆర్ ను తిట్టడం మాకు మోజా…!? పుట్టినప్పటి నుంచి తిట్టుకుంటూ పెరిగామా…!? మేం ఎందుకు తిట్టాలి. రాష్ట్రం దివాళా తిసింది. కేసీఆర్ కుటుంబం మాత్రం ఆగర్భ శ్రీమంతులయ్యారు. 2004, 2009, 2014, 2019 కేసీఆర్ అఫిడవిట్లు తీసి విశ్లేషించండి. వందల కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడ నుంచి వచ్చాయి… టీవీ, పేపర్, బంగ్లాలు ఎలా వచ్చాయి!? ఆ టెక్నిక్ ఏంటో రాష్ట్ర ప్రజలకు కూడా చూపించవచ్చు కదా? ఎకరాకు రూ. కోటి ఎలా సంపాదించాలో పేద రైతులకు చెప్పవచ్చు కదా! కేసీఆర్ నీతి మంతుడనో, అవినీతి మంతుడనో నేను అనను… ఆయనకు రాజకీయ వ్యాపకం తప్ప… వ్యాపారం లేదు. కానీ, ఆస్థులు ఎలా పెరిగాయి!? దాని గురించి ప్రజల తరఫున మేం ప్రశ్నించొద్దా!?
ప్రజలు ఊహించినట్టుగా తెలంగాణ లేదు. పరిస్థితులు సివిల్ వార్ కు దారి తీస్తాయేమోనన్న ఆందోళన కలుగుతోంది. ఒకనాడు రైటిస్టు భావాలు కలిగిన వాళ్లు నక్సల్స్ ఉండకూడదు అనుకునే వారు. వాళ్లు అభివృద్ధికి అడ్డు అని భావించే వాళ్లు. కానీ, ఈ రోజు మరోలా అనుకుంటున్నారు. నక్సల్స్ ఉంటే… ఇలాంటి చర్యలను నియంత్రించే వారేమో అని సమాజం అనుకునే పరిస్థితి దాపురించింది. హింసను ఎవరూ కోరుకోకూడదు… హింసకు మేం వ్యతిరేకం… హింసతో ఏ సమస్య పరిష్కారం కాదు. కానీ, పెడ ధోరణులు నియంత్రించడానికి ఏదో ఒక శక్తి ఉండాలి. ఆ శక్తి ఎలా వస్తుందో… ఏ రూపంలో వస్తుందో… చెప్పలేం అన్న భావనలో సమాజం ఉంది.
వైఎస్ చనిపోయిన 10 ఏండ్ల తర్వాత కూడా ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు ఆయన కుమారుడుని ముఖ్యమంత్రిని చేశాయి… ఇప్పుడు ఏపీలో పాలన ఎలా ఉంది అన్నది నేను మాట్లాడను… కేసీఆర్ పాలన అంత బాగుంటే ఆయన కుమార్తె నిజామాబాద్ లో ఓడిపోవడం ఏమిటి? రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరిలో గెలవడం ఏమిటి!? సందర్భం వచ్చినప్పుడు ప్రకృతి రంగ ప్రవేశం చేస్తుంది అనడానికి ఇదే సంకేతం. రాష్ట్రంలో ప్రజలెవరూ సంతోషంగా లేరు. కదిలిస్తే గొల్లున ఏడ్చే పరిస్థితుల్లో ఉన్నారు. ఏదో… అన్ రెస్ట్. తెలియని అన్ రెస్ట్! గెలిచిన వాడు సంతృప్తిగా లేడు. మంత్రి పదవుల్లో ఉన్నవాడు సంతోషంగా లేడు. చప్రాసి కన్నా హీనంగా తమ పరిస్థితి ఉందని బాధ పడుతున్నారు. ఎన్నడైనా ఇలాంటి పరిస్థితులు చూశామా!? ప్రగతి భవన్ లో బొచ్చుకుక్క చనిపోతే సంబంధిత డాక్టర్ల పై ఐపీసీ 409, 11(సి) సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ సెక్షన్ల కింద ఐదేళ్ల జైలుశిక్ష పడుతుంది. 20 మంది ఆర్టీసీ కార్మికు చనిపోతే కనీసం ప్రశ్నించ వద్దు అంటున్నారు. ఇలాంటి తెలంగాణ కోసమే పోరాడామా… ఇలాంటి తెలంగాణను చూడటానికే తెచ్చుకున్నామా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.