ఎన్నికల సందర్బంగా రాజకీయ పార్టీలు గజకర్ణ, గోకర్ణ, టక్కు టమార విద్యలకు పాల్పడడం కొత్తేమీ కాదు. కాకపోతే తాము అభ్యంతరం చేసిన అంశాల తరహా విద్యలనే కొందరు నాయకులు తమ ప్రత్యర్థులపై ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు రావడమే రాజకీయ విశేషం. తమకు జరిగితే నష్టం, ప్రత్యర్థులకు జరిగేది నష్టం కాదనే భావన రాజకీయ పక్షాల్లో నెలకొన్నపుడు సహజంగానే ఇటువంటి ఆరోపణలు, విమర్శలు వస్తుంటాయి. ఇంతకీ విషయమేమిటంటే..
ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ‘ట్రక్కు’ గుర్తు తమ కొంప ముంచిందని అధికార టీఆర్ఎస్ పార్టీ గగ్గోలు పెట్టిన సంగతి తెలిసిందే. తమ ఎన్నికల చిహ్నమైన ‘కారు’ను పోలి ఉన్న ‘ట్రక్కు’ గుర్తును ఫ్రీ సింబల్స్ నుంచి తొలగించాలని టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణా సీఎం కేసీఆర్ 2018 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల అనంతరం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. అభ్యర్థుల గెలుపు, ఓటములపై ప్రభావం చూపే కారు గుర్తును పోలిన ఎలక్షన్ సింబల్స్ ను తొలగించాల్సిందిగా నేరుగా కేసీఆరే కోరడం గమనార్హం. ముఖ్యంగా సమాజ్ వాదీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి కేటాయించిన ట్రక్కు గుర్తు అనేక ప్రాంతాల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల కొంప ముంచిందనే అభిప్రాయానికి ఆ పార్టీ నేతలు వచ్చారు.
నకిరేకల్, సంగారెడ్డి తదితర కీలక నియోజకవర్గాల్లో ట్రక్కు గుర్తుకు పోలైన ఓట్లను నివేదిస్తూ ఆయా గుర్తును తొలగించాలని ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించారు. పనిలో పనిగా ఇస్త్రీ పెట్టె గుర్తుపైనా ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ట్రక్కు గుర్తు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ కోరారు. ఈమేరకు కారు గుర్తును పోలిన ట్రక్కు గుర్తునేగాక అనేక ఇతర గుర్తులను కూడా ఫ్రీ సింబల్స్ నుంచి గత ఫిబ్రవరిలోనే ఎన్నికల సంఘం తొలగించింది. అయినప్పటికీ ఏడు పార్లమెంట్ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి బాట పట్టగా, పరాజితుల జాబితాలో కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత, ఆయన కుడి భుజం బోయినపల్లి వినోద్ కుమార్ కూడా ఉన్నారన్నది వేరే విషయం.
ఇక అసలు విషయంలోకి వద్దాం. ‘ట్రక్కు’ టమార గుర్తుల కారణంగా తమ అభ్యర్థులకు నష్టం జరుగుతోందనే కదా కేసీఆర్ ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదు సారాంశం? కానీ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ నేతలు ఇటువంటి ‘ట్రక్కు’ టమారా విద్యలనే అమలు చేస్తున్నారని న్యూడెమోక్రసీ పార్టీ తాజాగా ఆరోపిస్తోంది. ఇల్లెందు మున్సిపాల్టీలోని 9వ వార్డు కౌన్సిలర్ పదవి కోసం న్యూడెమోక్రసీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేళ్ల నాగలక్ష్మిని ఓడించడానికి టీఆర్ఎస్ నేతలు అనేక గిమ్మిక్కులు చేస్తున్నారట. నాగలక్ష్మి ఇప్పటికే రెండుసార్లు కౌన్సిలర్ గా గెలుపొందారని, గత ఎన్నికల్లో ఇల్లెందు మున్సిపల్ వార్డుల చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందారని న్యూడెమోక్రసీ పార్టీ నేతలు చెబుతున్నారు.
అయితే నాగలక్ష్మి ఈసారి కూడా గెలవడం ఖాయమని నిర్ధారించుకున్న అధికార పార్టీ నేతలు ఆమె ఓటమి లక్ష్యంగా అడ్డదారుల్లో ఎత్తుగడలు వేస్తున్నారన్నది న్యూడెమోక్రసీ నేతలు ఆరోపణ. ఇందులో భాగంగానే ఇండిపెండెంట్ గా మరొకరితో నామినేషన్ వేయించి, నాగలక్ష్మి కత్తెర గుర్తును పోలిన కటింగ్ ప్లేయర్ గుర్తును కోరి మరీ తెప్పించుకున్నారన్నది ఆయా ఆరోపణల సారాంశం. కత్తెరను పోలిన కటింగ్ ప్లేయర్ గుర్తును తెప్పించుకోవడమేకాదు, నాగలక్ష్మి వాల్ పోస్టర్ ను కాపీ కొట్టినట్లుగా అచ్చం అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థి ఎన్నికల ప్రచారపు పోస్టర్ ను రూపొందించారట. ఈ వార్డులో ఓటర్లను కన్విన్స్ చేయలేక కన్ఫ్యూజ్ చేయడానికి అధికార పార్టీ నేతలు చావు తెలివి తేటలు ప్రదర్శిస్తున్నారని నాగలక్ష్మి సోదరుడు ఆరోపిస్తున్నారు. తద్వారా ఓటర్లను గందరగోళానికి గురి చేస్తున్నారని న్యూడెమోక్రసీ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.