దళిత సాధికారత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలను తెలంగాణాకు చెందిన ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ప్రశంసించాయి. సీపీఎం, సీపీఐ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకటరెడ్డిలు ఈ విషయంలో సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలను ప్రశంసిస్తూ మద్ధతు ప్రకటించారు. దళిత సాధికారతపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో అఖిలపక్ష సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ, దళిత సాధికారత కోసం సీఎం కీసీఆర్ తీసుకున్న చొరవ, దృఢ నిశ్చయం సంతోషాన్ని కలిగిస్తున్నదన్నారు. మరియమ్మ లాకప్ డెత్ కేసులో వారి కుటుంబానికి సహాయం చేస్తూ సీఎం కేసీఆర్ తక్షణ స్పందన, తీసుకున్న నిర్ణయాలు దళిత సమాజంలో ఆత్మస్థైర్యాన్ని పెంచాయని కొనియాడారు. దళిత సాధికారత కోసం, ప్రభుత్వ నిర్ణయాలను అధికారులు చిత్త శుద్దితో అమలు పరచాలని కోరుతూ, ప్రభుత్వానికి తమ సంపూర్ణ సహకారం ఉంటుందని తమ్మినేని వీరభద్రం ప్రకటించారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ, దళిత సాధికారత కోసం సీఎం స్వయంగా ముందుకు రావడం, అటువంటి ఆలోచన చేయడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ 2003లోనే దళిత సాధికారత కోసం సమావేశం ఏర్పాటు చేసి అనేక అంశాలను చర్చించడం తనకు గుర్తున్నదని చాడ మననం చేసుకున్నారు. ప్రభుత్వం అమలు పరుస్తున్న కళ్యాణలక్ష్మి వంటి పలు అభివృధ్ధి, సంక్షేమ పథకాలు దళితులకు భరోసానిస్తున్నాయని చెప్పారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించడంతోపాటు, దళితుల మీద దాడులు జరిగితే ఊర్కోబోము అనే రీతిలో కార్యాచరణ చేపట్టి ప్రభుత్వం దళితులకు మరింతగా ధైర్యాన్ని నింపాలని అఖిలపక్ష సమావేశంలో కమ్యూనిస్ట్ పార్టీ నేతలు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకటరెడ్డిలు కోరారు.